
ప్రజాశక్తి- అనకాపల్లి
జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పేదలకు చాలా మేలు జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మండలంలోని గొలగాం పంచాయతీ కేటీవీ పాలెం, ఎల్లారమ్మ కాలనీలలో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు డ్రైన్లు, ఇంటింటి కొళాయిలు కావాలని కోరగా మంత్రి స్పందిస్తూ కేటీవీ పాలెం లో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి రూ.11 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. గొలగాం ఎస్సీ కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ కాలువలను ఆయన ప్రారంభించారు. ఎల్లారమ్మ కాలనీలో రూ.10 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. కొత్త తలారివారిపాలెంలో రూ.17.77 లక్షలతో అభివృద్ధి చేసిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడి కేంద్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, సర్పంచ్ నాగ నరసింహారావు, వైసిపి నాయకులు మల్ల బుల్లిబాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.