Aug 09,2023 00:04

ప్రశంసాపత్రాలు అందచేస్తున్న కలెక్టర్‌, తదితరులు

ప్రజాశక్తి - గుంటూరు : చిరు వ్యాపారులకు మెరుగైన జీవనోపాధి కల్పించటానికి కేంద్ర ప్రభుత్వం పిఎం స్వానిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు ద్వారా పెట్టుబడికి ఆర్థిక సహాయం అందిస్తున్నాయని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో పీఎం స్వానిధి పథకంపై ఎస్‌ఎల్‌బీసీ, మెప్మా ఆధ్వర్యంలో చిరువ్యాపారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌రావుతో కలసి కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. వీధి వ్యాపారులకు వడ్డీపై ఏడు శాతం రాయితీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం పీఎం స్వానిధి పథకం ద్వారా మొదటి విడత పెట్టుబడికి రూ.10 వేలు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వడ్డీ రాయితీతో జగనన్న తోడు పథకం ద్వారా రూ.10 వేలు బ్యాంకు ద్వారా రుణం అందిస్తుందన్నారు. పీఎం స్వానిధి ద్వారా మొదటి విడతలో అందించిన రుణం సకాలంలో చెల్లిస్తే రెండో విడతలో రూ.15 వేలు నుంచి రూ.20 వేలు వరకు, మూడో విడతలో రూ.30 వేలు నుండి రూ.50 వేల వరకూ వడ్డీ రాయితీతో రుణం వస్తుందన్నారు. కార్యక్రమంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మహిళాపాల్‌రెడ్డి, మెప్మా పీడీ వెంకటనారాయణ ప్రసంగించారు. అనంతరం జిల్లాలో ఎక్కువ రుణాలు మంజూరు చేసిన బ్యాంకర్లకు, రుణాల మంజూరుకు సహకారం అందించిన మెప్మా ఉద్యోగులకు కలెక్టర్‌, ఎమ్మెల్యే, ఇతర అధికారులు ప్రశంసాపత్రాలు అందచేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయరు సజీలా తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భవన నిర్మాణాలు వేగవంతం చేయాలి
ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు సెప్టెంబర్‌ 15వ తేదీ నాటికి పూర్తి చేసి, సంబంధిత శాఖలకు అప్పగించాలని పంచాయతీ రాజ్‌ ఇంజనీర్లను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం క్రింద మంజూరు చేసిన పనుల పురోగతిపై మండలాల వారీగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ మంగళవారం సమీక్షించారు. గ్రామ సచివాలయాలు 204 లక్ష్యం కాగా, ఇంతవరకు 88 పూర్తి చేసి అప్పగించామని, 34 రైతు భరోసా కేంద్రాలకుగాను వాటిని పూర్తి చేసి అప్పగించామని, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు 28కిగాను 17 పూర్తి చేసి అప్పగించామని కలెక్టర్‌కు పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ జి.బ్రహ్మయ్య వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద మంజూరైన 243 పనుల్లో 82 పూర్తి అయ్యాయని చెప్పారు. కలెక్టర్‌ మాట్లాడుతూ లక్ష్యం మేరకు మిగిలిన భవనాల నిర్మాణ పనులను పూర్తి చేయాలని, నిర్మాణ పనుల పురోగతికి సంబంధించి దశలవారీగా బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమీక్షలో పంచాయతీ రాజ్‌ శాఖ ఇఇ ముత్యంబాబు, డిఇఇలు, ఎఇఇలు పాల్గొన్నారు.