Jul 02,2023 02:06
లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-అద్దంకి: ప్రభుత్వం అమలు చేసిన నవరత్న సంక్షేమ పథకాలలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే జగనన్న సురక్ష కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతున్న జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 1,2 వార్డుల పరిధిలోని 1వ సచివాలయంలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించి మొత్తం 371 సర్వీసులను అందుబాటులో ఉంచి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వీసులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లను పరిశీలించి ఏర్పాటు చేసిన అధికారులను అభినందించారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ బి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరువ చేయాలని, ఆ పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా అని తెలుసుకొని ఒకవేళ అర్హత ఉంటే పథకం అందకపోతే వెంటనే లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు తీసుకునే విధంగా ఇంటింటికీ జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల రోజుల పాటు అధికారులు, కన్వీనర్‌లు ఇంటింటికీ తిరుగుతూ వారికి అందుతున్న పథకాలను తెలుసుకొని ఇంకా ఏమైనా సమస్యలుంటే వాటిపై రిజిస్టర్‌ చేసి వచ్చే ఆగస్ట్‌ నెల ఇంటి వద్దకే వెళ్లి సమస్యను పరష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తారని, మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకోవాలని తెలిపారు. అనంతరం ఇన్‌కమ్‌ సర్టిఫికేట్‌, కాస్ట్‌ సర్టిఫికేట్‌లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్‌డిఓ సరోజిని, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, డ్వామా పిడి నాయక్‌, రాష్ట్ర శాప్‌ నెట్‌వర్క్‌ చైర్మన్‌, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి కృష్ణచైతన్య, చైర్‌పర్సన్‌ ఎల్‌ ఎస్తేరమ్మ, వైస్‌ చైర్మన్‌లు, కౌన్సిలర్లు, వైసిపి పట్టణ, మండల అధ్యక్షులు, కన్వీనర్‌లు, కో ఆప్షన్‌ సభ్యులు, స్థానిక నాయకులు, మెప్మా మేనేజర్‌ ఫణి కుమారి, ఆర్‌పిలు, డ్వాక్రా మహిళలు, లబ్ధిదారులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మేదరమెట్ల: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జగనన్న సురక్ష క్యాంపులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా అన్నారు. శనివారం మేదరమెట్లలో పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ఆయన మాట్లాడుతూ ఇంతవరకు అర్హులై లబ్ధి పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని గుర్తించి వెంటనే ధవీకరణ పత్రాలను అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సమావేశంలో అర్హులైనటువంటి వారికి ధృవపత్రాలను అందజేయడం జరిగిందని అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ అర్హులైన వారు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సరోజినీదేవి, డ్వామా పిడి శంకర నాయక్‌, మండల అధ్యక్షురాలు సాదినేని ప్రసన్నకుమారి, మండల అభివృద్ధి అధికారి సురేష్‌బాబు, ఎంఆర్‌ఓ సుశీలతో పాటు సచివాలయ, మరియు పంచాయతీ సిబ్బంది, గృహ సారధులు, వాలంటీర్లు పాల్గొన్నారు.