ప్రజాశక్తి- అనకాపల్లి
ప్రభుత్వం పశుసంవర్థక శాఖ ద్వారా అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ లావణ్య తెలిపారు. మండలంలోని మాకవరం గ్రామంలో మంగళవారం పశు సంవర్ధక శాఖ, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. మండల పశువైద్యాధికారి అనిల్ కుమార్ 80 పశువులకు ఉచిత గర్భ కోశ చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశువులకు లంపి స్కిన్ వ్యాధి బారిన పడకుండా ఉచితంగా టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. రాయితీపై సంపూర్ణ మిశ్రమ దాణా అందుబాటులో ఉందన్నారు. పశువుల అత్యవసర చికిత్సలకు వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనం టోల్ ఫ్రీ నెంబర్ 1962 కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఉచితంగా ఖనిజ లవణ మిశ్రమాన్ని, మందులను డాక్టర్ లావణ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సీతానగరం పశు వైద్యులు డాక్టర్ రామారావు, గ్రామ సర్పంచ్ నూకరాజు, ఉప సర్పంచ్ లోవ లక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు బి. అప్పలనాయుడు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.










