ప్రజాశక్తి-అనకాపల్లి
ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రచారం చేయాల్సిన బాధ్యత సచివాలయ కన్వీనర్లదేనని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. స్థానిక వైసిపి కార్యాలయంలో సోమవారం అనకాపల్లి అర్బన్ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ సారధులే రానున్న ఎన్నికల్లో రథసారథులన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్వీనర్ల వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆదేశించారన్నారు. ఈనెల 6 నుంచి 20వ తేదీ వరకు గృహ సారధుల నియామకం పూర్తి కావాలని కన్వీనర్లను కోరారు. పెన్షన్ల రద్దు చేశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టి పారేశారు. అర్హత గల వారందరికీ సంక్షేమ పథకాలు తప్పక అందిస్తామని చెప్పారు. కొత్త పింఛన్లతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 44,51,750 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వైసిపి పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత, వైసిపి నాయకులు పీలా రాంబాబు, కొణతాల భాస్కర్‌రావు, జాజుల రమేష్, పలక రవి, సూరిశెట్టి రమణ అప్పారావు, దాడి నారాయణరావు, ఆళ్ల నాగేశ్వరరావు, కోరుకొండ రాఘవ తదితరులు పాల్గొన్నారు.










