
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో అధికారుల పాత్ర ఎంతో కీలకమని జెడ్పి చైర్మన్ శ్రీనివాసులు అన్నారు. శనివారం జెడ్పి సమావేశ మందిరంలో 1, 2, 4, 7వ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రగతి పథంలో నడిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు తగిన సహకారం అందించుకుంటున్నారని, తద్వారానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పథకాలు అమలులో క్షేత్రస్థాయి పరిశీలన అవసరమన్నారు. జిల్లాకు పలు పరిశ్రమలు తీసుకురావడం జరిగిందన్నారు. తాజాగా ఎలక్ట్రికల్ బస్సుల పరిశ్రమను త్వరలోనే శంఖుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కుప్పం ప్రజలకు సాగునీరు, దాహర్తి తీర్చేందుకు కృష్ణా జలాలను హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా కుప్పం బ్రాంచ్ కెనాల్ నుంచి తీసుకు వెళ్లే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఆ పనులు మరో 20 రోజుల లోపల ట్రైలర్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రాధాన్యత భవనాల నిర్మాణాలను వేగవంతం చేసి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యా విధానంలో భారత దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనంతగా సమూలమైన మార్పులు సీఎం జగన్ తీసుకొచ్చారన్నారు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమం భారీ ఎత్తున చేపట్టడం జరిగిందని,
క్షేత్రస్థాయిలో పాడి పరిశ్రమల ద్వారా మంచి ఆదాయం లభించే అవకాశం ఉందని జడ్పి సిఈవో ప్రభాకర్ రెడ్డి అన్నారు. జలజీవన్ మిషన్ పనులు జిల్లాలోవేగవంతంగా జరుగుతున్నాయని మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని అంచనాలు రూపొందించగా అధికారులు డిసెంబర్ నాటిక పూర్తి చేసే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో నాలుగు మండలాల్లో కరువు మండలాలుగా గుర్తించడం జరిగిందని ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా ఇస్తున్న పని దినాలను 50 శాతం పెంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థాయి సంఘాల సభ్యులు హాజరుకాగా జిల్లా విద్యాశాఖ అధికారి విజయేంద్ర రావు, డిఆర్‌డిఏ పిడి రవి, డ్వామా పీడి గంగా భవాని, డిపిఓ లక్ష్మి, ఎస్‌ఈ విద్యుత్ శాఖ శ్రీహరి, పిడి హౌసింగ్ పద్మనాభం, డిఎల్‌డిఓ రవికుమార్, జిఎండిఐసి, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.