Nov 02,2023 22:17

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌ అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులతో ప్రాధాన్యత భవన నిర్మాణాలు, గృహ నిర్మాణాల పనులపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాధాన్యత భవన నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆయా శాఖల వారు నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 5వ తేదీ లోపల పూర్తి అయిన 132 భవనాలను ఆయా శాఖల వారికి స్వాధీన పరచాలని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మండల అధికారులు, ఎంపీడీవోలు, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. అలాగే జిల్లాకు కేటాయించిన గృహ నిర్మాణాల పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, గృహనిర్మాణశాఖ పీడీ చంద్రమౌళి రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.