ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం ఉపాధ్యాయులు ఆవాస ప్రాంతాల్లో తిరిగి, తల్లిదండ్రుల్ని కలిసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా యుటిఎఫ్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు క్యాంపెయిన్ నిర్వహించాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్ ఉపాధ్యాయుల్ని కోరారు. ఆదివారం బ్రాడీపేటలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో 'ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం' కరపత్రాన్ని సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుటిఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా, మండల కమిటీల సభ్యులు, ఉపాధ్యాయులు ఈ కారక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు ఉండి, సహజ సిద్ధమైన వాతావరణంలో మనోవికాసం అభివృద్ధితో కూడిన విద్య ప్రభుత్వ పాఠశాలలకే సాధ్యమని అన్నారు. బడిని కాపాడుకునే పనిని తల్లిదండ్రులతో కలిసి ఉపాధ్యాయులు స్వీకరిస్తే ప్రభుత్వ బడికి ప్రత్యామ్నాయం ఉండని అన్నారు. కావున ఈ క్యాంపెయిన్‌లో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు సిహెచ్.ఆదినారాయణ, జి.వెంకేటశ్వరరావు, యం.గురుబ్రహ్మం, కె.ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.










