Feb 12,2023 22:27

ఉపాధ్యాయులకు యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు పిలుపు
ప్రజాశక్తి - ద్వారకాతిరుమల

             ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషి చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ ఏలూరు జిల్లా ప్రథమ కౌన్సిల్‌ సమావేశం స్థానికంగా ఆదివారం జరిగింది. సమావేశానికి యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఆర్‌.రవికుమార్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే పని ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం చేస్తుందని విమర్శించారు. పాఠశాలల సంఖ్యను కుదించడం, ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడం లక్ష్యంగా జిఒ.117ను ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాల్సిందిపోయి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని చెప్పి పాఠశాలలను విలీనం చేయడాన్ని యుటిఎఫ్‌ వ్యతిరేకిస్తుందన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని పెంచడం ద్వారా నాణ్యమైన విద్య ఎలా వస్తుందో ప్రభుత్వం చెప్పాలని కోరారు. ఉపాధ్యాయులను తగ్గించడం ద్వారా నాణ్యమైన విద్య రాకపోగా విద్యార్థుల సంఖ్య తగ్గడానికి, డ్రాపౌట్స్‌ పెరగడానికి కారణమవుతుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం విలీన ప్రక్రియను నిలుపుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విద్యాశాఖాధికారులు పాఠశాలలను సందర్శించడాన్ని సాగతి స్తున్నామని, ఉపాధ్యాయుల నుంచి గమనించిన లోపాలను సరిదిద్దే విధంగా ఆ సందర్శన ఉండాలని కోరారు. ఏదేమైనా ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు తగ్గించి, బోధనకు సమయం కేటాయించేట్లు ప్రభుత్వ చర్యలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ రద్దు కోరితే ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం ఎలాంటి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సదస్సులు, సమావేశాలు పెట్టుకోవడానికీ అనుమతి ఇవ్వకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, సిపిఎస్‌ లేదా జిపిఎస్‌ను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి మాట్లాడుతూ 30 రోజులు పని చేయించుకుని ఒకటో తేదీన జీతం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, గడిచిన రెండు సంవత్సరాలుగా ఒకటో తేదీ జీతం చెల్లించడం లేదని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి గాడిలో పడిందని ఒకసారి, ఆర్థిక పరిస్థితి బాగుండలేదని మరోసారి చెప్పి ఉద్యోగ, ఉపాధ్యాయులను మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి.నరసింహారావు, గౌరవాధ్యక్షులు ఎంవి.శ్యాంబాబు, అసోసియేట్‌ అధ్యక్షులు జి.వెంకటేశ్వరరావు, బి.సుభాషిణి, జిల్లా కోశాధికారి షేక్‌ ముస్తఫాఆలీ, జిల్లా కార్యదర్శులు పివి.సాగర్‌బాబు, పి.వీరకోటి, ఎంవి.అప్పారావు, ఎన్‌.రాంబాబు, ఎస్‌. సుధారాణి, జి.రాజేంద్రప్రసాద్‌, అల్లాడి రాజు, బివి.రవీంద్ర పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ ఎగురవేయగా, ఎస్‌టిఎఫ్‌ఐ పతాకాన్ని రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు వి.కనకదుర్గ, యుటిఎఫ్‌ పతాకాన్ని సిహెచ్‌.జగన్మోహన్‌రావు ఆవిష్కరించారు.
యుటిఎఫ్‌ జిల్లా నూతన కమిటీ ఇదే
యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఆర్‌.రవికుమార్‌, పివి.నర్సింహరావు మళ్లీ ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా ఎంవి.శ్యాంబాబు, సహాధ్యక్షురాలిగా బి.సుభాషిణి, సహాధ్యక్షునిగా జి.వెంకటేశ్వరరావు, కోశాధికారిగా ఎస్‌కె.ముస్తఫాఆలీ, కార్యదర్శులుగా ఎ.విక్టర్‌, పివి.సాగర్‌బాబు, బి.బాలకృష్ణ, పి.వీరకోటి, ఎంవి.అప్పారావు, బి.అనురాధ, ఎన్‌.రాంబాబు, జి.రాజేంద్రప్రసాద్‌, ఎస్‌.సుధారాణి, ఇ.శివశంకరరావు, సిహెచ్‌.శ్రీధర్‌, జి.దేవానంద్‌, కె.కమల్‌కుమార్‌ ఎన్నికయ్యారు.