ప్రజాశక్తి-పంగులూరు: ''గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మేము తీసుకొస్తాం, గ్రామాల్లో అభివృద్ధిని వేగవంతం చేస్తాం, అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన రోజు చెప్పారు. అయితే ఈ నాలుగేళ్ల కాలంలో ఆ అభివృద్ధి అనే మాట ప్రచార ఆర్భాటమే తప్ప, ఆచరణ మాత్రం లేదని ఇట్టే తెలిసిపోతోంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అది చేస్తాం, ఇది చేస్తామని మహా ప్రగల్బాలు పలికిన నాయకులు ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారనటానికి ఇదే నిదర్శనం. పంగులూరు మండలంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 12 కోట్ల, 36 లక్షల రూపాయల వ్యయంతో, 39 భవనాలు, 28 సిమెంట్ రోడ్లు మంజూరు కాగా, ఈ నాలుగేళ్ల కాలంలో కేవలం 14 భవనాలు మాత్రమే నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రారంభమయ్యాయి. 28 సిమెంట్ రోడ్లకు గాను, 18 సిమెంట్ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. భవనాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం విషయంలో, ప్రభుత్వం బిల్లులు సకాలంలో అందించక పోవడమే నిర్మాణాలు వెనకపడటానికి కారణమని పలువురు అంటున్నారు. మండలంలో 14 సచివాలయాలు, 14 రైతు భరోసా కేంద్రాలు, 11 వెల్‌నెస్ సెంటర్లు ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో మంజూరు చేసింది. ఇందులో 8 సచివాలయాలను కొత్తగా నిర్మించగా, ఆరు సచివాలయాలు ఈపాటికే ఉన్న పంచాయతీ కార్యాలయాలపై నిర్మించారు. అందువలన కొత్తగా నిర్మించిన వాటికి ఒక్కోదానికి రూ.80 లక్షల చొప్పున మంజూరు కాగా, పంచాయతీ కార్యాలయాలపై నిర్మించిన సచివాలయాలకు ఒక్కోదానికి రూ.25 లక్షలు మంజూరయ్యాయి. ఈ 14 సచివాలయాల నిర్మాణానికి నాలుగు కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అయితే బిల్లులు సక్రమంగా సకాలంలో ప్రభుత్వం నుంచి రాకపోవడం వలన, 9 సచివాలయాలు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. కేవలం ఐదు సచివాలయాలు మాత్రమే ఇప్పటికి ప్రారంభమయ్యాయి. 14 రైతు భరోసా కేంద్రాలకు గాను, ఒక్కో దానికి రూ.21.8 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తానికి రెండు కోట్ల 94 లక్షల రూపాయలు మంజూరు కావలసి ఉండగా, అందులో బిల్లుల ఆలస్యం కారణంగా, ఆరు రైతు భరోసా కేంద్రాలు మాత్రమే నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రారంభమయ్యాయి. ఇంకా ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ప్రారంభానికి నోచుకోలేదు. ఒక్కో వెల్నెస్ సెంటర్‌కు 17.5 లక్షల రూపాయల చొప్పున 11 వెల్నెస్ సెంటర్‌లు మండలానికి మంజూరయ్యాయి. వీటిలో కేవలం మూడు సెంటర్లు మాత్రమే నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రారంభం అయ్యాయి. మిగతా 8 ప్రారంభానికి నోచుకోలేదు. మండలంలో సుమారు కోటిన్నర రూపాయలకు పైగా బిల్లులు కావలసి ఉండగా, భవనాల నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరగక వివిధ దశలలో ఉన్నాయి. దీనివలన భవనాలు ప్రారంభం కాలేదు. భవనాలు ప్రారంభం కానందువలన అనేక గ్రామాల్లో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నాలుగేళ్లలో మండలంలో 28 సిమెంట్ రోడ్లు మంజూరు కాగా, 18 సిమెంట్ రోడ్లు మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఒక్కో సిమెంట్ రోడ్డు 10 లక్షలు చొప్పున, కోటి 80 లక్షల రూపాయలు బిల్లులు కావాల్సి ఉండగా, అందులో 75శాతం డబ్బులు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా 25 శాతం డబ్బులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మిగతా పది సిమెంట్ రోడ్లు నిర్మాణం ఏమాత్రం నోచుకోలేదు. ఏది ఏమైనా చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్లనే నిర్మాణాలు ప్రారంభించిన నాలుగేళ్లయిన ఇంతవరకు పూర్తి కాలేదు. కేవలం ప్రభుత్వ ఉదాశీన వైఖరి కారణంగానే అడుగు ముందుకు పడటం లేదని అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిధులు విడుదల చేసి పనులు వెంటనే జరిగే విధంగా చూడాలని పలువురు కోరుతున్నారు.










