Oct 13,2023 01:16

ప్రజాశక్తి - బాపట్ల
పంట పొలాలకు సాగునీరు అందించడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమవడంతో వరి పొలాలు క్షామంతో ఎండిపోయాయని టిడిపి ఇన్‌చార్జి వేగేసిన నరేంద్ర వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని మురుకొండపాడు గ్రామంలోని పంట పొలాలను ఆయన గురువారం పరిశీలించారు. దేశానికీ వెన్నెముక లాంటి రైతులు వైసిపి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. సకాలంలో సాగు నీరందక పంట పొలాలు ఎండిపోతున్నాయని అన్నారు. రూ.వేలాది పెట్టుబడి పెట్టిన రైతులు సాగునీరు అందకపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన చెందుతున్నరని అన్నారు. ఇప్పటికే వరి నాట్లు వేసిన పంట పొలాలకు నీరు అందక ఎండిపోతున్న పరిస్థితి  అన్నదాతల్లో కలవరపెడుతుందని అన్నారు. సాగునీరందని వరి పొలాల్లో  కలుపు పెరిగిపోవడంతో అదనపు ఖర్చు భరించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో పట్టి సీమ ద్వారా రైతులకు పుష్కలంగా సాగునీ రందించామని గుర్తు చేశారు. ఇరిగేషన్ శాఖ, ఎంఎల్‌ఎలు ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి సమస్య తీవ్రతను గుర్తించాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని సాగునీటి కాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరు విడుదల చేయాలన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందించి పంటలు ఎండిపోకుండా కాపాడాలని కోరారు.