ప్రజాశక్తి - ఎటపాక
తామర పురుగుతో పంట నష్టపోయిన మిరప రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని, పరిహారం దక్కాలంటే రైతులంతా పోరాటానికి సిద్ధం కావాలని గోదావరి జిల్లాల ఉపాధ్యాయ పిడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి అన్నారు. మండలంలోని నెల్లిపాక, నందిగామ గ్రామాల్లో నల్లి, తామర పురుగు ఆశించి నష్టపోయిన మిరప పంటలను శుక్రవారం ఎమ్మెల్సీ సాబ్జి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, రైతు నాయకులు పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు రూ.2 లక్షలు పెట్టుబడి అయిందని, తామర పురుగు ఆశించడంతో పంట పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సాబ్జి మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ సర్కారుకు మిరప రైతులకు తామర పురుగు వల్ల జరిగిన నష్టం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. పోలవరం ముంపు సాకుతో ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఇవ్వకుండా తప్పించుకోవాలని చూస్తుందని విమర్శించారు. పార్టీలకతీతంగా యువ రైతులంతా ఆందోళనకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. శాసన మండలిలో రైతుల పక్షాన పోరాడతామని హామీ ఇచ్చారు.
ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య మాట్లాడుతూ ఏజెన్సీలో ఈ-క్రాప్ నమోదు సరిగా చేయక, రైతులకు అవగాహన కల్పించపోవడంతో నష్టపోతున్నారని తెలిపారు. తామర పురుగు వలన నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మర్లపాటి నాగేశ్వరరావు, పులుసు సూర్యనారాయణ, తోటకూర రాంబాబు, సీపీఎం మండల కార్యదర్శి ఐవి, నాయకులు పులుసు బాలకృష్ణ, ఆకిశెట్టి రాము, ఇరపా అజరు, సొందె రామారావు, జి హరనాధ్, టీడీపీ మండల అధ్యక్షుడు పుట్టి రమేష్, జనసేన మండల అధ్యక్షుడు మారాసు గంగాధర్, రైతులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
విఆర్.పురం : మండలంలోని పెద్దమట్టపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ షేక్ సాబ్జి, ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య శుక్రవారం సందర్శించారు. కొనుగోలు చేయకుండా ఉన్న ధాన్యాన్ని వారు సిపిఎం నాయకులతో కలిసి పరిశీలించారు. కొనుగోలు ఎందుకు అపారో రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాబ్జి, కృష్ణయ్య మాట్లాడుతూ టార్గెట్ పూర్తయిందని చెప్పి ఇలా 10 లారీలు ధాన్యాన్ని వదిలి వేయడంపై మండిపడ్డారు. పూర్తిగా ధాన్యం కొనుగోలు చేసి చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పన కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చినబాబు, ఎంపిపి కారం లక్ష్మి, ఎంపిటిసి పూనెం ప్రదీప్ కుమార్, సర్పంచ్ వెట్టి లక్ష్మి, రైతు నాయకులు చిక్కాల రామారావు, కారం సత్తిబాబు పాల్గొన్నారు.
పాఠశాల సందర్శన
మండలంలోని చిన్నమట్టపల్లి పాఠశాలను ఎమ్మెల్సీ సాబ్జి, రైతు నేత కృష్ణ సందర్శించారు. విద్యార్థులకు పెడుతున్న మెనూ, విద్యాబోధన తదితర అంశాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో మెరుగైన విద్య, మౌలిక సౌకర్యాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ తెలిపారు.










