Sep 26,2023 21:37

ప్రజాశక్తి - పాలకొండ : అంగన్వాడీల పట్ల జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి గృహ నిర్బంధాలను, ముందస్తు అరెస్టులను, అణచివేతకు పాల్పడడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక గ్యాస్‌ ఆఫీస్‌ ఆవరణంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాలా రమణారావు, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌ విమాప్రభ జిల్లా కోశాధికారి బి అమరవేణి మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం తెలంగాణా కంటే అదనంగా వేతనం చెల్లిస్తానన్న హామీ అమలు చేయమని శాంతియుత ఆందోళన చేస్తున్న అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చట్టాన్ని అంగన్వాడీలకు అమలు చేయమని అడిగితే అరెస్టులు చేయించిందని, ఐదేళ్ల నుండి పెండింగ్‌ పెట్టిన టిఎ బిల్లులు చెల్లించమని కోరితే గృహనిర్బంధానికి పాల్పడిందని విమర్శించారు. అణిచివేత, నిర్బందాల ద్వారా పరిపాలన సాగించాలని వైసిపి ప్రభుత్వం భావిస్తుందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడుతామని హెచ్చరించారు. అంగన్వాడీలకు అరెస్టులు, కేసులు కొత్తేమీకాదని, గత ప్రభుత్వాలు ఇలాంటివి ప్రయోగించే అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని గుర్తించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యుత్‌ఛార్జీలు, ఇంటి, చెత్త పన్నులు, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్న జగన్‌ ప్రభుత్వానికి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కనీసజ్ఞానం లేదా అని ప్రశ్నించారు. పోరాడేతత్వం కలిగిన అంగన్వాడీలతో దురుసుగా వ్యవహరించి జగన్‌ తన రాజకీయ భవిష్యత్తును కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు పాలకొండ మండల సమన్వయ కమిటీ కార్యదర్శి కాద రాము, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు జి.జెస్సీబారు, ఆర్‌.భవాని, ధనలక్ష్మి, రోజా తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం నేతలపై అక్రమ కేసులకు ఖండన
ప్రజాశక్తి - బెలగాం
సిపిఎం రాష్ట్ర నేతలపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ఒక ప్రకటనలో ఖండించారు. అంగన్వాడీ ఉద్యమానికి సంఘీభావంగా సిపిఎం రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రదర్శనగా వెళ్తున్న సందర్భంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు, వి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ తదితరులను పోలీసులు అరెస్ట్‌ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసులు పెట్టారని పేర్కొన్నారు. గవర్నర్‌పేట పోలీసులు 14మంది సిపిఎం రాష్ట్ర, జిల్లా, నగర నేతలపై ఐదు సెక్షన్ల కింద అక్రమ కేసులు మోపారన్నారు. ఈ అక్రమ కేసులను, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.