Aug 08,2023 22:23

మాట్లాడుతున్న సిఎంఒ సిఇఒ సమీర్‌ శర్మ

* డ్రాపౌట్స్‌పై ఇంటింటా సర్వే
* వాలంటీర్లతో సచివాలయ ఉద్యోగుల సమన్వయం
* సిఎంఒ సిఇఒ సమీర్‌శర్మ
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : 
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టిసారించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. విద్య, వైద్యం, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌తో కలిసి సమీక్షించారు. మండల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో గర్భిణుల వివరాలు సేకరించి, వారిలో రక్తహీనత లేకుండా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులు, పౌష్టికాహారాన్ని అందించాల్సిన బాధ్యత ఐసిడిఎస్‌ అధికారులపై ఉందన్నారు. ప్రతినెలా పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నన్నా, పర్యవేక్షణ లేకపోవడం వల్ల రక్తహీనత శాతాన్ని తగిగంచలేకపోతున్నట్లు తెలిపారు. ప్రతి నెలా గర్భిణుల వివరాలతో పాటు రక్తహీనత ఏ దశలో ఉందో గుర్తించి, మరుసటి నెలలో వారిలో ఎంతమేరకు మెరుగుపడిందో పరిశీలించాలని సూచించారు. సరుబుజ్జిలి మండలం కొండవలస, ఇచ్ఛాపురం మండలం లాలాపేట, నరసన్నపేట రూరల్‌, కోటబొమ్మాళి మండలం లఖందిడ్డి, పోలాకి మండలం ఈదులవలసలో రక్తహీనత ఎక్కువగా ఉందని, ఆ గ్రామాలపై మరింత శ్రద్ధ చూపాలన్నారు.
డ్రాపౌట్స్‌పై ఇంటింటా సర్వే
బడి మానేసిన పిల్లలు (డ్రాపౌట్స్‌) గురించి వాలంటీర్ల ద్వారా తెలుసుకొని, వారిని తిరిగి బడిలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లల తల్లితండ్రుల ఇంటింటికి వెళ్లి వారితో మాట్లాడి బడికి వెళ్లేలా చేయాలని సూచించారు. కొన్నిచోట్ల డ్రాపౌవుట్స్‌ ఉన్నాయని, అవి లేకుండా విద్యాశాఖాధికారులు చొరవ చూపాలన్నారు. ఇంటింటి సర్వే చేసి శత శాతం డ్రాపౌట్స్‌ లేకుండా చూడాలని ఆదేశించారు.
జిల్లాలోని 550 ఆస్పత్రుల్లో 4,834 పడకలు ఉండగా వాటి నుంచి వచ్చే బయో మెడికల్‌ వ్యర్థాలను ఎప్పటికప్పుడు డంపింగ్‌ చేయాలని సూచించారు. వ్యర్థాలను తరలించేందుకు అవసరమైన రవాణా సదుపాయం కల్పించాలని, వాటికి ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాలని చెప్పారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తరచూ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. నిషేధిత ప్లాస్టిక్‌ పరిశ్రమలు, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, సిపిఒ వి.ఎస్‌.ఎస్‌.ఎల్‌ ప్రసన్న, జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకటరామన్‌, ఐసిడిఎస్‌ పీడీ జి.జయదేవి, సమగ్ర శిక్ష ఎపిసి ఆర్‌.జయప్రకాష్‌, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు, డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి, కాలుష్య నియంత్రణ మండలి జెడి ఎ.సుబ్బారావు, పర్యవేక్షక ఇంజినీర్‌ ప్రసాదరావు, కార్యనిర్వాహక ఇంజినీర్‌ రామారావు నాయుడు, ఎఇఇలు పద్మావతి, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.