
ప్రజాశక్తి - పంగులూరు
గుంటూరులో రోడ్డు ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ పూర్ణ మహేశ్వరరావు (45) అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ఆయన స్వగ్రామమైన మండలంలోని చిన్నమల్లవరం గ్రామంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. పూర్ణ మహేశ్వరరావు దొనకొండ రైల్వే స్టేషన్‌లోని సీఆర్పీ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన చిన్నమల్లవరం సోమవారం తీసుకొచ్చారు. ఆయన మృతదేహం తీసుకొచ్చేసరికి ఆయన బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆయనతో దోమకొండ రైల్వే స్టేషన్‌లోని జిఆర్‌పి స్టేషన్లో పని చేసే సహచర ఉద్యోగులు, రేణంగివరం ఎస్‌ఐ తిరుపతిరావు ఆయన మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. పోలీసులు తుపాకులతో నాలుగు రౌండ్లు గాలిలో పేల్చి నివాళి అర్పించారు. పూర్ణమహేశ్వరరావుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు.