Sep 20,2023 21:48

సమావేశంలో మాట్లాడుతున్న ప్రిన్సిపల్‌ జయమణి

ప్రజాశక్తి - పాలకొండ : స్థానిక ప్రభుత్వ మహిళ జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాలలో పర్యాటక యువ క్లబ్‌ను ఏర్పాటు చేశామని పర్యాటక అధికారి ఎన్‌.నారాయణరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం డిగ్రీ, జూనియర్‌ కళాశాలలలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఏడో తరగతి నుండి యూనివర్సిటీ వరకు పర్యాటక క్లబ్బులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. హై స్కూల్‌ నుండి డిగ్రీ, ఇంజనీరింగ్‌, నర్సింగ్‌ కాలేజీల్లో యువ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ క్లబ్‌ల ద్వారా భారతీయ సంస్కృతి వారసత్వ సంపదను తెలియజేసేందుకు, జిల్లాలో పర్యాటక ప్రదేశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు జయ మణి, డాక్టర్‌ ఉత్తరావిల్లి సత్యప్రభ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, చుట్టూ పక్కల శుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు పి.రమేష్‌, ఎ. విజయగౌరి, ఎ.సురేష్‌, ఎ.రమ్య, బి.లావణ్య, సింహాచలమమ్మ తదితరులు పాల్గొన్నారు.