Aug 09,2023 20:40

మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు పోతురాజు

ప్రజాశక్తి-ఆలూరు
ఆలూరులోని ప్రభుత్వ డిగ్రీ, ఐటిఐ కళాశాలలకు నిధులు కేటాయించి భవనాలు నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు ఎస్‌.పోతురాజు, సహాయ కార్యదర్శి బి.పరమేష్‌ కోరారు. బుధవారం జ్యోతిబసు భవన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షులు ఉలిరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆలూరులో ప్రభుత్వ డిగ్రీ, ఐటిఐ కళాశాలలకు ఏళ్లు గడుస్తున్నా సొంత భవనాలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. 1987 ఆలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించినా భవన నిర్మాణానికి రాజకీయ గ్రహణం పట్టి మధ్యలో ఆగిపోయిందన్నారు. సొంత భవనాలు లేకపోవడంతో ప్రభుత్వ బార్సు హైస్కూల్‌-2 కొన్ని గదులను డిగ్రీ కళాశాలకు ఇవ్వడంతో డిగ్రీ విద్యార్థులు అందులోనే విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. 2008లో ప్రభుత్వ ఐటిఐ కళాశాలను ఏర్పాటు చేస్తే నేటి వరకు సొంత భవనాలు లేవన్నారు. ప్రభుత్వ బార్సు-1 హైస్కూల్‌లో పాత గదులను ఐటిఐ కళాశాలకు ఇవ్వడంతో అదే భవనంలోనే నేటి వరకు ఐటిఐ కళాశాల కొనసాగుతోందని తెలిపారు. అవి కూడా పురాతన భవనాలు కావడంతో భయం గుప్పెట్లో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. విద్యార్థి, యువజన సంఘాలు పోరాట ఉద్యమాలు చేస్తే 2019లో ఐటిఐ కళాశాలకు అగ్రహారం గ్రామ సమీపంలో స్థలం కేటాయించారని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ, ఐటిఐ కళాశాలకు స్థలాలు కేటాయించినా భవన నిర్మాణాలకు నిధులు మంజూరు కాకపోవడంతో కళాశాలలు అభివృద్ధి చెందక వ్యిద్యార్థులు చదువుపై ఆసక్తి చూపడం లేదన్నారు. ఈ ప్రాంత పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు కేటాయించేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల భవన నిర్మాణం 75 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా 25 శాతం పూర్తి చేయడానికి నిధులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని చెప్పారు. నిధులు విడుదల చేసి నిర్మాణం పూర్తి చేసి పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షులు గిరిమూర్తి, మండల నాయకులు మధు, రమేష్‌, హరికృష్ణ పాల్గొన్నారు.