Nov 01,2023 23:15

- రోగుల పట్ల సిబ్బంది దురుసుతనం
- నర్సులే కాన్పు చేయడంతో నిండు ప్రాణం బలి
- కాన్పు సమయంలో లేని డాక్టర్లు
- ప్రవేటు క్లినిక్లు నడుపుతున్న ప్రభుత్వ వైద్యులు
ప్రజాశక్తి - అద్దంకి
స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంకు గతంలో వందల సంఖ్యలో ఓపీలు వచ్చేవి. ఇటీవల కాలంలో కొత్త వైద్యులు రావడం, సిబ్బంది తరచూ మారడంతో వచ్చిన రోగులకు సరైన వైద్యం అందడంలేదు. సిబ్బంది బాధ్యతా రాహిత్యంగా సమాధానాలు చెప్పడం వంటి కారణాలతో ఇటీవల కాలంలో రోగుల సంఖ్య తగ్గిపోయింది. పట్టణానికి అతి సమీపంలోని ఒక గ్రామం నుండి కాన్పు నిమిత్తం ప్రభుత్వ ఆరోగ్య సామాజిక కేంద్రానికి నిండు గర్భిణిని తీసుకొచ్చారు. శీలం మెర్సీ రాణి (19) మొదటి కాన్పు నొప్పులతో భాధ పడుతూ ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల వరకు బాధలు పడింది. ఆతర్వాత కాన్పు అయ్యింది. కాన్పు సమయంలో పేషంట్ పరస్థితి బాగాలేదని, స్వయంగా వచ్చి రోగుని పరిశీలించాలని డాక్టర్ వాహిలా చౌదరికి నర్సులు చెప్పారు. తాను రావడం కుదరదని ఫోనులో సలహాలు చెప్పగా నర్సులే కాన్పు చేశారు. ఆ సమయంలో ఎక్కవగా రక్తస్త్రావం కావడంతో ఆమె మృతి చెందారు. 
సాయంత్రం ఆరు గంటలకు కాన్పు జరిగితే రాత్రి తొమ్మిది గంటలకు డాక్టర్ వాహిలా చౌదరి వచ్చి చూసి చనిపోయిందని నిర్ధారణ చేసుకొని ఆక్సిజన్ పెట్టి, సెలైన్ పెట్టి అంబులెన్సులో ఒంగోలు రిమ్స్‌కు పంశారు.
(శవానికి వైద్యం చేయడం )
ఒంగోలులో డాక్టర్ పరిశీలించి ఇక్కడికి రాక ముందే చనిపోయిందని నిర్ధారించారు. చనిపోయిన శీలం మెర్సీ రాణి శవాన్ని అద్దంకి తీసుకువచ్చారు. అంబులెన్సు వెంట కార్‌లో డాక్టర్ వాహిలా చౌదరి, ఆమె భర్త ఒంగోలు వెళ్లి రిమ్స్ కు వచ్చారు. కేవలం ఆన్ డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని మృతురాలి బంధువులు ఆరోపించారు.
ఒంగోలు రిమ్స్‌లో పురిటి బిడ్డ
నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేసి సమగ్రంగా విచారణ చేసి డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నక్కా కాంతారావు డిమాండ్ చేశారు. డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన సొంత వైద్య శాలలో వైద్యం చేస్తూ ప్రభుత్వవైద్య శాలలో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గతంలో కూడా ఆమెపై పిర్యాదులు చేశారు. మెర్సీ రాణి శవాన్ని ఒంగోలు తీసుకుని వెళ్లి అక్కడ రెండు లక్షలు ఇస్తానని భేరం పెట్టిన డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.