ప్రజాశక్తి-ఆలూరు
ఆలూరు ప్రభుత్వ డిగ్రీ, ఐటిఐ కళాశాలలకు నిధులను కేటాయించి భవనాలు నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. శుక్రవారం అంబేద్కర్ సర్కిల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల సహాయ కార్యదర్శి పరమేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, మండల ఉపాధ్యక్షులు ధనుంజరు మాట్లాడారు. ఆలూరులో ప్రభుత్వ డిగ్రీ, ఐటిఐ కళాశాలలకు సొంత భవనాలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఆలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించినా సొంత భవనాలు నిర్మించడంలో ప్రభుత్వాలు, స్థానిక పాలకులు విఫలం చెందారని విమర్శించారు. ప్రస్తుత డిగ్రీ కళాశాల ప్రభుత్వ బార్సు-2 పాఠశాలలోని కొన్ని గదులను ఇవ్వడంతో అందులోనే విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఐటిఐ కళాశాలను 2008లో కళాశాల ఏర్పాటు చేస్తే నేటి వరకు సొంత భవనాలు లేవని చెప్పారు. ఐటిఐ కళాశాల బార్సు-1 హైస్కూల్‌లో పురాతన భవనాల్లో భయం గుప్పెట్లో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. 2019లో ఐటిఐ కళాశాలకు అగ్రహారం గ్రామం దగ్గర స్థలం కేటాయించారని చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షులు ఉలిరాజు, మండల నాయకులు మధు, లింగమూర్తి, మల్లారెడ్డి, గాదిలింగ, శివశంకర్, శివరాజు, మల్లి, ప్రవీణ్ పాల్గొన్నారు.
అంబేద్కర్ సర్కిల్‌లో నిరసన చేపడుతున్న నాయకులు










