ప్రభుత్వ , దేవస్థానం భూములను పోలవరం నిర్వాసితుల ఇళ్ల స్థలాలకు కేటాయించాలి
ప్రజాశక్తి - ఎటపాక
మండలంలోని పురుషోత్తపట్నంలోని దేవస్థానం భూములను, ఎటపాకలోని ప్రభుత్వ భూములను పోలవరం నిర్వాసితులకు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని ఏపీ గిరిజన సంఘం నాయకులు గురువారం తహశీల్దార్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురుషోత్తపట్నంలోని సర్వేనెంబర్ 9, 71, 72లో గల 6.30 ఎకరాల దేవస్థానం భూములు, ఎటపాకలోని ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు. 1/70 చట్టం అమలులో ఉన్నప్పటికీ ఇక్కడ భూములను గిరిజనేతరులు అనుభవిస్తున్నారని, ఆ స్థలాల్లో గిరిజనులు పాకలు వేసుకుంటే మాత్రం నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజనేతరులు భూములు అనుభవిస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టినా పట్టించుకోని అధికారులు, పాకలు వేసుకున్న గిరిజనులను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం ఏమాత్రం సరికాదని పేర్కొన్నారు. గిరిజనేతరులు కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేసి, ఆ భూమిని చేసుకొని పోలవరం నిర్వాసితుల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో గిరిజన సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కాకా అర్జున్ దొర, ఇరపా అజరు కుమార్, నాయకులు ఇరపా సత్యం, బుద్దుల భద్రయ్య, సవలం రాము, నక్కా సూరిబాబు, సీసం కొండ, ప్రవీణ్ ఉన్నారు.










