Oct 07,2022 23:03

వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు: ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌, పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు, ఎంపీడీఓలతో కలెక్టర్‌ కార్యాలయం నుండి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వైయస్‌ ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ల పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పనుల బిల్లులు వెబ్‌ సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. బిల్లులు చెల్లించడానికి తగిన చర్యలు చేపడతామన్నారు. కాంట్రాక్టర్లు పనులు చేయకపోతే వారిని తొలగించి వేరొకరికి పనులు అప్పగించాలని స్పష్టం చేశారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు భవన నిర్మాణాలపై సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఎంపిడిఓలు, ఇంజినీరింగ్‌ అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్‌.గోపాలకృష్ణ, పిఓలు సూరజ్‌ గనోరే, రామశేషు, డ్వామా పిడి రమేష్‌ రామన్‌, ఉపాధి హామీ ఎపిడి జె.గిరిబాబు, ఎంపీడీఓలు, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.