ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణ పనులు సెప్టెంబరు 15వ తేదీలోగా అధికారులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు పి రంజిత్‌బాషా ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలపై ఇంజినీరింగ్ అధికారులతో గురువారం స్థానిక కలెక్టరు ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం నిధుల అనుసంధానంతో చేపట్టిన భవనాల నిర్మాణ లక్ష్యాలు చేరుకోవాలని కలెక్టరు తెలిపారు. భవన నిర్మాణాలలో ఏజెన్సీల సమస్యలు ఉత్పన్నమైతే తక్షణమే ఏజెన్సీలను మార్చాలన్నారు. గ్రామ సచివాల యాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌ల భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున వేగంగా నిర్మించాలన్నారు. గ్రామాలకు స్థిరాస్థులుగా ఉండే ప్రభుత్వ భవనాలు నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలన్నారు. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలు పెండింగ్‌లో ఉండడంపై కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి ఇంజినీరింగ్ అధికారులు విధులు నిర్వర్తించా లన్నారు. రేపల్లె మండలంలో గ్రామ సచివాలయాల నిర్మాణ పనులు జరగకపోవడంపై పిఆర్ ఏఇని సస్పెండ్ చేయాలని సంబంధిత ఎస్‌ఇని కలెక్టరు ఆదేశించారు. ఎన్ని పర్యాయాలు సూచించినా పనులలో పురోగతి కనిపించకపోవడంపై ఇంజనీరింగ్ అధికారులను మందలించారు. భవన నిర్మాణాలు, విధినిర్వహణలో నిర్లిప్తంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
కర్లపాలెం, కొరిశపాడు, సంతమాగులూరు, కారంచేడు మండలాలలో పనుల పురోగతి లేదని కలెక్టరు అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత ఏఇలకు షోకాజ్ నోటీసు జారీచేయాలని ఎస్‌ఇని ఆదేశించారు. జగనన్న కాలనీలలో భూమి చదును, తదితరమైన 97 పనులు పెండింగ్‌లో ఉండడంపై కలెక్టరు ఆరా తీశారు. జగనన్న కాలనీలలో 74 ఆర్చీలు నిర్మించాలని ఆయన సూచించారు. 88 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల పనులు సత్వరమే పూర్తిచేయాలని అన్నారు. భవన నిర్మాణ పనులలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని పనులు నిలిపివేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అధికారులు కథలు చెప్పడం మాని నిబద్ధతతో పనిచేయాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్‌ఇ హరేరామకృష్ణ, డ్వామా పిడి వైశంకర్ నాయక్, గృహనిర్మాణ శాఖ పిడి ప్రసాద్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.










