గుమ్మలక్ష్మీపురం : జియమ్మ వలస మండలం అలమండ, మరువాడ రెవెన్యూలో పెద్ద ఎత్తున ప్రభుత్వ, బంజరు భూములు ఉన్నాయని వీటిని గిరిజనులకు, దళితులకు పంచాలని ఆదివాసి గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ అలమండ, మరువాడ రెవెన్యూలో తొమ్మిది గిరిజన గ్రామాలు ఉన్నాయని ఈ గ్రామాల్లో గిరిజనలు, దళితులు, పేదలు అనేకమంది భూములు లేకుండా ఉన్నారని అన్నారు. అలమండ, మరువాడ రెవెన్యూ పరిధిలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొంతమంది స్థానికేతర్లు, పక్క పంచాయతీలో ఉన్న పెత్తందారులు ఒక్కొక్కరు 10 నుండి 15 ఎకరాల భూమి వరకు ఆక్రమించి అన్యాక్రాంతంగా ప్రభుత్వ బంజర భూములు దున్నుకుంటున్నారని వీటిని రీ సర్వే జరుగుతున్న సందర్భంలో సర్వేయర్లు పెత్తందారుల సాగులో ఉంటే వారికి రెగ్యులర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ బంజరు భూములలో ఉన్న పెత్తందారులకు హక్కులు, అర్హత లేని వారి దగ్గర నుంచి భూమి తీసుకుని గిరిజనులకు, దళితులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో గిరిజనులు, దళితులు, పేదలే ఆ భూముల్లో సాగుకు సిద్ధపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ మండల కార్యదర్శి గోరపాడు సోమయ్య, గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు కోరంగి సీతారాం, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు భూతాల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.










