Mar 24,2023 23:54

ప్రజలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి

ప్రజాశక్తి- కె.కోటపాడు
జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి అన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా ఆక్రమణదారులపై పోలీస్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని పాతవలస, సూదివలస గ్రామాల్లో ఆయన పర్యటించారు. పాతవలస హైస్కూల్‌ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని హెచ్‌ఎంను ఆదేశించారు. నాడు-నేడు ద్వారా నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రంలో ఉన్న రికార్డులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఇటీవల వచ్చిన తుఫాను వల్ల మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. కూరగాయలు నిల్వ చేసుకోవడానికి కోల్డ్‌ స్టోరేజ్‌ మంజూరు చేయాలని కోరగా రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా తీర్మానం చేసి తనకు పంపాలని ఉద్యానవన శాఖ సహాయకురాలు గజ్జి అనూషను ఆదేశించారు. అనంతరం సూదివలసలో నిర్మాణం పూర్తి చేసుకున్న సచివాలయ భవనాన్ని పరిశీలించారు. సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ఎటువంటి వివాదాలు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులందరి సమక్షంలో భూ సర్వే నిర్వహించాలని తహశీల్దారు రమేష్‌ బాబును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శచిదేవి, ఏవో సోమశేఖర్‌, ఎంఈఓ మధు మూర్తి, ఐసిడిఎస్‌ ఏపీవో మంగతాయారు, ఎంపీటీసీ వర్రి రామునాయుడు, సర్పంచులు జామి శ్రవణ్‌, ఆదిరెడ్డి సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.