ప్రజాశక్తి - తాడేపల్లి : అసైన్డ్ భూముల్లో పదేళ్లకుపైగా ఇళ్లేసుకుని నివాసం ఉంటున్న వారికి జీవో 55 ప్రకారం రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తామని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, ఎంటిఎంసి ప్రత్యేకాధికారి రాజకుమారి తెలిపారు. అసైండ్, ప్రభుత్వ భూముల్లో పక్కా ఇళ్లు నిర్మించుకొని నివాసముంటున్న వారి వివరాలపై కమిషనర్ శారదాదేవి, ఇతర అధికారులతో తాడేపల్లిలోని మున్సిపల్ కార్యాలయంలో జెసి శుక్రవారం సమీక్షించారు. అనంతరం జెసి మాట్లాడుతూ అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉన్న వారికి సైతం గుర్తించి వారికి 100 గజాలలోపుంటే ఉచితంగా రిజిస్ట్రేషన్, 100 గజాలు దాటితో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం జీవో 60 ద్వారా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రెవిన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ ప్రాంతాల్లో 1175 నివాసాలు గుర్తించారని, ఇంకా సర్వే జరుగుతోందని నివాసాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. రైల్వే స్థలాల్లో నివాసముంటున్న వారిళ్లను తొలగించే ఆలోచన తమకైతే లేదన్నారు. రైల్వే శాఖ తొలగిస్తే వారికి పక్కా నివాసాలు ఇచ్చే వరకు తొలగించవద్దని కోరుతామని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న వారిని ఖాళీ చేయించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. 1980 నుండి 2000 సంవత్సరం వరకు 1175 మందికి డి పట్టాలు ఇచ్చామని, అవి కూడా రెగ్యులైజేషన్ చేస్తామని ప్రకటించారు. శ్మశాన వాటిక సమస్యలనూ పరిష్కరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. మంగళగిరి పట్టణ పరిధిలో 6 శ్మశానాలు, తాడేపల్లిలో 6 శ్మశానాలు ఉన్నాయని, ఈ రెండు ప్రాంతాల్లో మరో నాలుగెకరాల్లో శ్మశానాలు అవసరమని, వీటి కోసం ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నామని చెప్పారు. నిడమర్రులోలో శ్మశానానికి 66 సెంట్లు కేటాయించగా అది కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి, డిఇ. కృష్ణారెడ్డి, టౌన్‌ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.










