Oct 21,2022 23:13

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, ఇతర అధికారులు

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున
ప్రజాశక్తి- సిరిపురం
: ప్రభుత్వ భూములు దురాక్రమణకు గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపైనే ఉందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున స్పష్టం చేసారు. శుక్రవారం విఎంఆర్‌డిఎ బాలల ప్రాంగణంలో నిర్వహించిన రెవెన్యూ అధికారుల శిక్షణను జెసి కెఎస్‌.విశ్వనాధన్‌, డిఆర్‌ఒ శ్రీనివాసమూర్తితో కలిసి జ్యోతిప్రజ్వళనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగాకలెక్టర్‌ మాట్లాడుతూ బ్రిటిష్‌ కాలం నుంచి నేటి వరకు రెవెన్యూశాఖ ప్రాముఖ్యత ఎంతో పెరిగిందన్నారు. మారుతున్న పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ, ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. దీనికి ఇటువంటి శిక్షణలు ఎంతో దోహదపడతాయన్నారు. ఆర్‌టిఐ దరఖాస్తులు పరిష్కారంలో పూర్తి స్థాయి విచారణ జరిపి, మాచారాన్ని దఖాస్తు దారులకు అందించాలన్నారు.
జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాధన్‌ మాట్లాడుతూ సచివాలయాల పరిధిలో ప్రభుత్వ, ఇతర భూములకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉండాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమణలకు గురికాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా రెవెన్యూ అంశాలపై సూచనలు,ప్రభుత్వ ఉత్తర్వులు పుస్తకాన్ని జిల్లా కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, జెసిలను రెవెన్యూ ఉద్యోగులు దుశ్శాలువాతో సత్కరించారు
బుక్‌ ఎగ్జిబిషన్‌
శిక్షణ ప్రాంగణంలో సర్వే, రీసర్వే నిబంధనలు, భూముల కొలతలకు ఉపయోగించే పాత, అధునాతన పద్దతులు, అలాగే పాత, కొత్త రికార్డుల పుస్తకాల ప్రదర్శన నిర్వహించారు. దీనిని జిల్లా కలక్టరు, జాయింట్‌ కలెక్టర్లు పరిశీలించారు. వర్క్‌షాప్‌లో డిఆర్‌ఒ శ్రీనివాసమూర్తి, ఆర్‌డిఒలు హుసేన్‌ సాహేబ్‌, భాస్కర్‌ రెడ్డి, ఎస్‌డిసిలు, తహశీల్దార్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.