
ప్రజాశక్తి - పరిగి : మండల కేంద్రంలోని షుగర్ ఫ్యాక్టరీ భూముల వ్యవహారంపై కోర్టుల ద్వారా భూ నిర్వాసిత రైతులు పోరాటాలు చేస్తుంటే ఆ భూముల్లో ఉన్న ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించుకునేందుకు యాజమాన్యం పలు ప్రయత్నాలు చేస్తోందని, కోర్డు పరిధిలో ఉన్న ఈ ఆంశంపై జోక్యం చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని భూ నిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. మడకశిర రోడ్డు రహదారికి పక్కన ఉన్న సర్వేనెంబర్ 368/2లోని 3.5 ఎకారాల ప్రభుత్వ భూమినిషుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆక్రమణకు పాల్పడుతోందని వాపోయారు. గతంలో ఈ ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి అందాలన్న ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు బండలు నాటి సరిహద్దులను వేశారన్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లను తొలగించి సరిహద్దులను చెరిపే ప్రయత్నాలు చేశారని అన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భూ నిర్వాసిత రైతులు కోరారు. రహదారికి ప్రక్కగా ఉన్న ఈ భూమిని కలుపుకొని షుగర్ ఫ్యాక్టరీ భూములను విలువ పెంచాలని చూస్తున్నారని ఈ భూమిని ప్రభుత్వం అయినా తీసుకోవాలని లేదా దీనిని గతం నుండే సాగు చేస్తున్న రైతులకన్నా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అయితే బండరాళ్లను తొలగించిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ సౌజన్య లక్ష్మి, ఎస్‌ఐ నరేంద్ర హామీ ఇచ్చారు.