May 18,2023 00:21

మాట్లాడుతున్న సిపిఎం నేత వెంకన్న

ప్రజాశక్తి-దేవరాపల్లి
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై స్పందించాల్సిన అవసరం లేదని దేవరాపల్లి తహశీల్దార్‌ బహిరంగంగా పత్రికా ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న పేర్కొన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ మండలంలో అనేక ఆక్రమణలు జరుతున్నాయని, ప్రతిదానికీ స్పందించడం కష్టమని మండల మేజిస్ట్రేట్‌ హోదాలో ఉన్న తహశీల్దారు ప్రకటించడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసిన వారే ఇటువంటి ప్రకటనలు చేయడం వల్ల ప్రజల్లో రెవెన్యూ అధికారుల పట్ల పూర్తిగా విశ్వాసం పోతుందని తెలిపారు. తహశీల్దారు ప్రకటన పలు అనుమానాలకు తావిస్తోందని, వెంటనే ప్రభుత్వ భూములు ఆక్రమణదారులపై చర్యలు చేపట్టి ప్రజల్లో ఆ అనూమానాలను నివృత్తి చేయాలని కోరారు.
తారువ రెవెన్యూ సర్వే నెంబరు 179లో రెడ్డి వారి చెరువు, మరికొన్ని సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అడ్డగోలుగా కబ్జా చేయడం, దేవరాపల్లి సర్వే నెంబరు 20లో 38 ఎకరాల ఆక్రమణపై కోర్టు తీర్పు ఇచ్చినా ఆ భూమిని స్వాధీనం చేసుకోకుండా అడ్డుపడటం, మారేపల్లి రెవెన్యూ సర్వే నెంబరు 115లో 23.15 ఎకరాల దేవుని భూమిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి అమ్మేయడం, దేవరాపల్లి రెవెన్యూ సర్వే నెంబర్లు 280/1, 281/2లో అక్రమంగా ఫలసాయం పొందడం వంటి అంశాలపై ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలునాయుడుకు తాను బహిరంగ లేఖ రాసినట్లు వెల్లడించారు. ఆక్రమణల భూములు స్వాధీనం చేసుకోవాలని, కోర్టు వివాదంలో ఉన్న భూముల్లో పంటలు వేయాడాన్ని నివారించడానికి అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వాలని, లేకుంటే ఆక్రమణదారులకు మీరు, మీ ప్రభుత్వం కొమ్ము కాస్తున్నట్లు భావించవలసి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నట్లు వెల్లడించారు. ఇంత స్పష్టంగా రాసిన లేఖపై స్పందించవలసిన అవసరం లేదంటున్నారంటే అధికార దుర్వినియోగానికి పాల్పుడినట్లు అర్థమవుతుందని తెలిపారు. పైఅంశాల్లో ఏ ఒక్కటైనా తప్పుడు ఆరోపణలు అని రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేసి రుజువు చేస్తే తనపై చర్యలు తీసుకోవచ్చని వెంకన్న స్పష్టం చేశారు.