- పేదలకు పట్టాలు పేరిట వినతులు
- ఆర్మీ జవాన్లకు కట్టబెట్టడానికి రూ.లక్షలు చేతులు మారినట్లు ప్రచారం
- రాజాం, చిట్టియ్యపాలెం గ్రామాల మధ్య వివాదమవుతున్న 233 సర్వే నెంబర్‌లోని 40 ఎకరాల భూమి
ప్రజాశక్తి- బుచ్చయ్యపేట
బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామం 233 సర్వే నెంబర్‌లో గల సుమారు 40 ఎకరాలు భూమిని కాజేయడానికి కుట్ర జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎకరా రూ.40 లక్షల వరకు ధర పలుకుతున్న ఈ భూములు చేతులు మారడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రానికి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో, రాజాం-తట్టబంద తారు రోడ్డుకు ఆనుకొని ఉండటంతో రెవెన్యూ అధికారుల సహకారంతో రిటైర్ట్ ఆర్మీ జవాన్ల పేర ఈ భూమి ద్వారా సొమ్ము చేసుకోవడానికి అధికార వైసిపి నాయకులు రంగం సిద్ధం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజాం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 233లో కొండ పోరంబోకు భూమి 40 ఎకరాలు ఉంది. రాజాం -తట్టబంద రోడ్డులో చిట్టియ్యపాలెం గ్రామం వరకు ఈ భూమి విస్తరించి ఉంది. ఈ భూమిలో 20 ఏళ్ల నుండి అటవీశాఖ ఆధ్వర్యాన చిట్టియ్యపాలెం గ్రామస్తులు సోషల్ ఫారెస్టు సాగు చేస్తూ వచ్చే డబ్బులను గ్రామ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు.
అయితే ఈ భూములను రాజాం గ్రామంలోని భూమి లేని సుమారు 30 నుండి 40 కుటుంబాలకు కేటాయించి పట్టాలు మంజూరు చేయాలని ఆ గ్రామానికి చెందిన అధికార వైసిపి వారు కొంతకాలంగా విన్నవిస్తూ వస్తున్నారు. ఇదే విషయంపై ఈ నెల 27న సోమవారం కూడా రాజాం గ్రామ సర్పంచ్ మరిస నాని ఆధ్వర్యాన బుచ్చయ్యపేట తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
భూమిని కాజేసే కుట్ర అంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు
సర్వే నెంబర్ 233లోని 40 ఎకరాల భూమిని కాజేయడానికి కుట్ర జరుగుతుందంటూ రాజాం గ్రామం టిడిపికి చెందిన మాజీ ఎంపిటిసి మరిస సతీష్, మాజీ సర్పంచ్ ఎండపల్లి సత్యారావు, అధికార వైసిపికి చెందిన ఎంపిటిసి భర్త, మాజీ సర్పంచ్ మరిస చినరమణ ఈ నెల 27న సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ స్పందనలో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల సహకారాలతో రాజాంలోని కొద్ది మందికి పట్టాలు ఇచ్చి, మిగతా భూమిని ఎకరాకు రూ.2.50 లక్షలు చొప్పున తీసుకొని రిటైర్డ్ ఆర్మీ జవాన్లకు పట్టాలు ఇవ్వడానికి అధికార పార్టీకి చెందిన కొంత మంది రంగం సిద్ధం చేసినట్లు, ఈ వ్యవహారంలో ఇప్పటికే రూ.20 లక్షల వరకు చేతులు మారినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ భూమిని గ్రామ అవసరాల నిమిత్తం సుమారు 60 ఏళ్లగా కాపాడుకుంటూ వస్తున్నామని, ఇప్పటికే హైస్కూల్ నిర్మించామని, కళాశాల, వసతి గృహాలు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య కేంద్రాలు వంటి వాటికి ఈ భూమిని ఉపయోగించాలని వీరు కోరుతున్నారు.
చిట్టియ్యపాలెం గ్రామస్తుల ఫిర్యాదు!
ఈ భూమిలో సోషల్ ఫారెస్టులో భాగంగా చిట్టియ్యపాలెం గ్రామస్తులు ప్రస్తుతం యూకలిప్టస్ తోటను సాగు చేశారు. ఈ భూమిని తమకు కేటాయించి పట్టాలు మంజూరు చేయాలని కోరుతున్న రాజాం గ్రామానికి చెందిన వారు సోమవారం యూకలిప్టస్ తోటను నరకడానికి ప్రయత్నించగా, చిట్టియ్యపాలెం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సమయంలో అక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో చిట్టయ్యపాలెం గ్రామస్తులు ఈ భూమిని తమ గ్రామంలోని పేదలకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ స్పందనలో వినతిపత్రం అందజేసినట్లు తెలిసింది.
ఒకే భూమి కోసం రాజాం, చిట్టియ్యపాలెం గ్రామస్తులు గోడవలు పడుతూ, తమకంటే.., తమకు కేటాయించాలని కోరుతూ వినవపత్రాలు ఇస్తుండగా, మరో వైపు రెవెన్యూ అధికారుల సహకారంతో లక్షలాది రూపాయలకు బేరం కుదుర్చుకొని ఈ భూమిని రిటైర్డ్ ఆర్టీ జవాన్లకు కట్టబెట్టేందుకు అధికార వైసిపి నాయకులు ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో ఈ భూమిపై ఏమి జరుగుతుందో వేచి చూడాలి.










