ప్రజాశక్తి -గాజువాక : షీలానగర్‌లో ఇఎస్‌ఐ హాస్పిటల్ నిర్మాణం వద్ద ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని, దీన్ని అడ్డుకోవాలని కోరుతూ టిడిపి ఆధ్వర్యాన ఆసుపత్రి ఏర్పాటు స్థలం వద్ద బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, లక్షలాదిమంది కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 69వ వార్డు పరిధి షీలానగర్ వద్ద గత ప్రభుత్వం ఇఎస్‌ఐ హాస్పిటల్ నిర్మాణానికి 10 ఎకరాలు స్థలం కేటాయించిందన్నారు. ఈ స్థలాన్ని పరిరక్షించి ఇఎస్‌ఐ హాస్పిటల్ నిర్మాణాన్ని శరవేగంతో పూర్తి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఇఎస్‌ఐ హాస్పిటల్ నిర్మాణ స్థలంలో కల్వర్టుల నిర్మాణానికి అనుమతి ఇచ్చిన గాజువాక జోనల్ కమిషనర్, ఆర్‌డిఒపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీన్ని ఆపకపోతే జివిఎంసి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 69వ వార్డు టిడిపి ఇన్‌ఛార్జి అక్కిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రసాదుల శ్రీనివాస్, విజయబాబు, బోండా జగన్, గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, మహమ్మద్ రఫీ, విళ్లా రామ్మోహన్, కోగంటి లెనిన్‌బాబు, చెరుకూరు నాగేశ్వరరావు, తమ్మిన విజయకుమార్, అలమండ రాజు, జీవన్‌బాబు పాల్గొన్నారు.










