ప్రజాశక్తి - భోగాపురం : ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజలకు వివరించాలని జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం నాయకులు లోకం మాధవి ఆ పార్టీ కార్యవర్గ సభ్యులకు సూచించారు. మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నియోజకవర్గం పరిధిలోని పార్టీ కార్యవర్గ సభ్యులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక దశలవారీగా మద్యం నిషేదం చేస్తానని చెప్పి మాట మార్చారని అన్నారు. విద్యుత్ చార్జీలను ఈ నాలుగేళ్ల కాలంలో ఎనిమిది సార్లు పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లిమర్ల అభివృద్దికి దూరంగా ఉందన్నారు. విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే అనేక మందికి ఈ ప్రాంతంలో ఉపాధి దొరుకుతుందన్నారు. కాని ఇంకా శంకుస్థాపన దశలోనే ఉందన్నారు. ఇలాంటి విషయాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఆమె అన్నారు. తనకు ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ది అంటే ఎంటో చేసి చూపిస్తానని అన్నారు. ఈ ప్రాంతలో ఐటి కంపెనీలు, పార్కులు ఏర్పాటు చేసి హైదరాబాదుకు ధీటుగా ఐటిని అభివృద్ది చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










