ప్రజాశక్తి -చింతూరు
మండలంలోని ఏడుగురాళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మలేరియా జ్వర పీడితులకు ఇంజక్షన్లు, మందులు అందుబాటులో ఉంచాలని సిపిఎం మండల నాయకులు మల్లం సుబ్బమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిని సిపిఎం స్థానిక నాయకులు మల్లం సుబ్బమ్మ, సౌలం కన్నయ్య, తాటికొండ కోటేశ్వరరావు, సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు జరుగుతున్న చికిత్సపై అడిగి తెలుసుకున్నారు. మలేరియా జ్వరం నిర్ధారణ అయితే ట్రీట్మెంట్ నిమిత్తం ఇంజక్షన్లు, టాబ్లెట్స్ ప్రైవేటు మందుల షాపు నుంచి కొనుగోలు చేస్తున్నట్లు రోగులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా సెప్టెంబర్ నెలలో ఆసుపత్రికి సంబంధించి మెడికల్ ఇండెంట్ పెట్టినా కూడా ఇంజక్షన్స్ టాబ్లెట్స్ రాలేదని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకురాలు మల్లం సుబ్బమ్మ మాట్లాడుతూ ఆసుపత్రికి ప్రతిరోజు 60 మందికి తగ్గకుండా రోగులు వస్తున్నారని వారికి మందులు, ఇంజక్షన్లు అందుబాటులో ఉంచకపోవడం సరికాదని పేర్కొన్నారు. బాలింతలు, గర్భిణు, రోగులకు ఆసుపత్రిలో తగిన విధంగా పడక సౌకర్యాలు లేవన్నారు, ఆరు పడకలు మాత్రమే ఉండటం రోగులు ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే హాస్పిటలను 50 పడకల ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేశారు.










