Jul 04,2023 16:46

ధర్నా నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు

ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
- సిపిఎం ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ధర్నా

నందికొట్కూరు:
స్థానిక ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను కల్పించాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం హాస్పిటల్‌ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ లక్షల రూపాయల ప్రజాధనంతో హాస్పిటల్‌ నిర్మాణం చేసినప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ 7 లక్షల ఎక్స్రే మిషన్‌ ఏర్పాటు చేసినప్పటికీ అందులో ఫిలిం లేకపోవడంతో రోగులు ప్రైవేట్‌ ల్యాబ్‌ ఆశ్రయించాల్సి వస్తుందని అన్నారు. అదేవిధంగా ఏడుగురు డాక్టర్లు ఉండాల్సినటువంటి హాస్పిటల్‌లో ప్రస్తుతం ముగ్గురు డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. అత్యవసర విభాగంలో కనీసం 60 పడకలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అదేవిధంగా గర్భిణులకు పరీక్షలు నిర్వహించేందుకు గైనకాలజిస్ట్‌ లేకపోవ డంతో ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. జిల్లా వైద్యాధికారి వెంటనే డాక్టర్స్‌ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఓబులేసు, రమణయ్య, నాగన్న, రామిరెడ్డి, ఉపేంద్ర నాయుడు, సీతారాం శ్రీనివాసులు,మద్దమ్మ లక్ష్మమ్మ పాల్గొన్నారు.