కరోనా వ్యాధి విస్తరణ వైద్య రంగంలో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. మన దేశంలో మొదటి వేవ్ కంటే రెండవ వేవ్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రపంచంలో ఉన్న మొత్తం కేసుల్లో మన దేశంలోనే 50 శాతం కేసులు ఉన్నాయి. మన దేశంలో దీని తీవ్రత వల్ల బెడ్ల కొరత, మందుల కొరత, ఆక్సిజన్ కొరత, వ్యాక్సినేషన్ కొరత తీవ్రంగా ఉంది. మరణాలూ ఎక్కువ. శ్మశానాల్లోనూ, మార్చురీలలోనూ దహన సంస్కారాల కోసం క్యూలైన్లు చూస్తున్నాము. 60 శాతం వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న మన దేశంలో ప్రభుత్వం ప్రజలకు ముందుగా ప్రకటించిన ప్రకారం వ్యాక్సినేషన్ ఇవ్వలేకపోయింది. 92 దేశాలకు వ్యాక్సినేషన్ అందిస్తామని డబ్బు అడ్వాన్సులు తీసుకున్నా వారికి వ్యాక్సినేషన్ పంపలేని పరిస్థితి నెలకొన్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ప్రయివేటు వైద్యం మీద ఆధారపడాల్సి రావడం ఎక్కువైంది. బిల్లులు చెల్లించలేక తీవ్ర వేదనకు గురవుతున్నారు. అంటే అసాధారణమైన పరిస్థితి కరోనా రెండవ విడత సందర్భంగా దేశంలోనూ, రాష్ట్రంలోనూ నెలకొన్నది. ఒక రకంగా ప్రపంచ పరిస్థితులకంటే ఇది తీవ్రం. మన రాష్ట్రంలో కూడా కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితి తీవ్రంగా ఉన్నది. ఐసొలేషన్ కేంద్రాలు లేక, ఉన్నా సరైన వసతులు లేక ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు.
సంక్షోభానికి ప్రభుత్వ విధానమే కారణం
రెండవ వేవ్‌లో ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కోడానికి కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానమే. 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలవాలన్న తపన, తాపత్రయం, అధికార కాంక్షే దీనికి కారణం. ఈ ఉద్దేశంతోనే కుంభమేళా భారీ స్థాయిలో నిర్వహించి లబ్ధి పొందాలని చూసింది. శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఒకవైపు సెకండ్‌వేవ్ వస్తుందని, ఇది మరింత తీవ్రంగా ఉంటుందని ఆందోళన వెలిబుచ్చినా నరేంద్రమోడీ పట్టించుకోలేదు. ప్రపంచంలో అమెరికా, ఇంగ్లాండు వంటి దేశాలు సెకండ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యాక్సినేషన్ చాలా దేశాలతో పోల్చితే ఎక్కువ మందికి ఇవ్వగలిగారు. వైరస్ లక్షణాన్ని ఎప్పటికప్పుడు కనిపెడుతూ వ్యవహరించారు. మొదటి వేవ్‌లో చైనా అనుసరించిన అనేక అనుభవాల్ని ప్రపంచంలో చాలా దేశాలు పరిగణలోకి తీసుకున్నాయి. మన దేశంలో కూడా మొదటి విడత కరోనా సోకినప్పుడు కేరళ రాష్ట్రం తీసుకున్న అనుభవాలు ఉన్నా అటు నరేంద్ర మోడీగానీ, ఇటు జగన్‌మోహన్‌రెడ్డిగానీ తగిన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. నరేంద్ర మోడీ-భజన బృందం సాగించిన ప్రచారం యొక్క తీవ్రత...బిజెపి అఖిల భారత సభల్లో మోడీ కరోనాను జయించాడని తీర్మానం పెట్టే స్థాయికి చేరింది. ఈ కారణాలవల్లే దేశంలో రెండవ వేవ్ నివారణకు తగిన చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టలేకపోయింది.
కరోనా క్లస్టర్లు
రెండవ విడత వైరస్ లక్షణాలు తీవ్రంగా ఉండడమేగాక ఒకరి నుండి ఒకరికి సోకడం కూడా ఎక్కువగానే ఉన్నది. రెండవ విడత లక్షణాల్లో మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. క్లస్టర్ల రూపంలో మహారాష్ట్రలో ఇది తొలుత బాగా విజృంభించింది (2వ విడత). ఆ తరువాత దేశంలో క్రమంగా పట్టణాల నుండి గ్రామాలకు విస్తరించింది. ఇప్పుడు గిరిజన ప్రాంతాలు కూడా ఈ తాకిడికి గురయ్యాయి. నదుల్లో శవాలు, ఆసుపత్రుల ముందు బెడ్లు దొరకక మరణాలు లాంటివి చూశాము. మన రాష్ట్రంలో 20,000 అని, దేశంలో 3,20,000 అని ప్రభుత్వాలు కేసుల సంఖ్య ప్రకటిస్తున్నా వాస్తవంగా 4 నుండి 6 రెట్లు ఎక్కువగా ఉంటాయని పత్రికా కథనాలు తెలుపుతున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం, రాజకీయ దురుద్దేశం, మత, సాంప్రదాయ ఆలోచనలు రెండవ విడత కరోనా వేవ్‌లో ప్రజలకు తీరని కష్టాలు కలిగించాయి.
నివారణకు మార్గం
2021 మార్చిలో ప్రారంభమైన కరోనా రెండవ విడత ప్రమాదం నుండి రక్షణ పొందాలన్నట్లైతే అందరికీ వ్యాక్సినేషన్ అందించడమే మార్గం. అందరికీ వ్యాక్సినేషన్ అందించేలోపు ఆక్సిజన్ కొరత నివారించుకోవడం, మందుల కొరత అధిగమించడం, అవసరమైన అందరికీ ఆసుపత్రులలో బెడ్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవడం జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఇటువైటు దృష్టి పెట్టడం మానేసి హెల్త్ హబ్‌లు, కార్పొరేట్ ఆసుపత్రులు, ఇన్స్యూరెన్సు కంపెనీలు... వీటి మీద ఆధారపడతూ ఉంది. మందుల బ్లాక్ మార్కెట్‌ను నివారించి చౌకగా ప్రజలకు అందించడానికి చర్యలు లేవు. వ్యాక్సినేషన్ అందరికీ అందించేదానికి చర్యలు లేవు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేటటువంటి మొత్తం వ్యాక్సిన్ లలో మన దేశంలో 60 శాతం ఉత్పత్తి అవుతుంది. మనకు 100 సంవత్సరాల అనుభవం ఉంది. అయినా ప్రభుత్వ రంగంలో వాటి ఉత్పత్తిని పెంచడంలో గాని, ప్రయివేటు రంగంలో కంపెనీలకు ముందుగానే ఆర్డర్లు ఇచ్చి అవసరాలకు తగినట్లుగా సిద్ధం చేసుకోవడంలో మన కేంద్ర ప్రభుత్వం వెనకబడింది. ఒక నెలకు 6.5 కోట్లు డోసులు ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. వీటన్నింటిని మన ప్రజలకు అందించినా రెండు సంవత్సరాల కంటే ముందు వ్యాక్సినేషన్ పూర్తిగాదు. ఆరున్నర కోట్ల డోసులు నెలకు ఉత్పత్తి అంటే మన దేశంలో ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పున 100 కోట్ల మందికి అనుకున్నా 200 కోట్ల డోసులు కావాలి. రెండున్నర సంవత్సరాల లోపుగా అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వలేము. కనుక శాస్త్రవేత్తలు ఈ ప్రభుత్వ వైఖరిని పెద్దఎత్తున నిరసిస్తున్నారు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు- కరోనా కోసం బడ్జెట్‌లో రూ.35 వేల కోట్లు కేటాయించింది. ఈ డబ్బులో రూ.10 వేల కోట్లు వ్యాక్సినేషన్ కోసం కేటాయించినా మన అవసరాలు తీరుతాయి. ఆ పని చేయడం కోసం ఈ ప్రభుత్వం పూనుకోలేదు. ఈ ప్రభుత్వం ఇలాంటి వైఖరితో ఉండడానికి ప్రధాన కారణం దానికి ఇన్స్యూరెన్సు కంపెనీల మీద, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మీద, కార్పొరేట్ ఆసుపత్రుల మీద ఉన్న నమ్మకమే. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం కూడా ఈ విశ్వాసాన్నే తేటతెల్లం చేస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
మన దేశంలో సుమారు 30 సంవత్సరాలకుపైగా ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రజారోగ్య వ్యవస్థను క్రమంగా నిర్వీర్యం చేస్తూ ఆరోగ్య శ్రీ, కార్పొరేట్ ఆసుపత్రులు ఇలాంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముందుపీఠిన ఉన్నది. కేరళ వామపక్ష ప్రభుత్వం, వామపక్ష ఉద్యమాలు కారణంగా ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం చేయబడింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కేంద్రాల్లో సిబ్బంది కొరత, మందుల కొరత లేకుండా ఈ కాలంలో నిర్వహణ జరుగుతూ వచ్చింది. కరోనా సమయంలో ఈ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ పునాదిగా ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా చిన్న రాష్ట్రంలో కేసులు ఎక్కువైనా (రోజుకు ఆంధ్రాలో 20,000, కేరళలో 40,000 కేసులు) ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ బలోపేతంగా ఉన్నందున తట్టుకోగలిగారు. మరణాల సంఖ్య మన రాష్ట్రం కంటే తక్కువగా ఉన్నాయి. రెండో ముఖ్యమైన చర్య పంచాయతీలు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల మీద ఆధారపడి ప్రజల సహకారంతో ఐసొలేషన్ కేంద్రాలు, వైద్య శిబిరాల నిర్వహణ మొదలెట్టారు. వలస కూలీలకు ప్రత్యేక సదుపాయాలు చేశారు. కరోనా కాలంలో పనులు కోల్పోయినవారికి 14 రకాల నిత్యావసర వస్తువుల కిట్‌లు అందించారు. ఆకలి మంటలను నివారించారు. మన రాష్ట్రంలో, అనేక పనుల్లో కరోనా నివారణ కూడా ఒక పనిగా భావించబడింది. ఒక అసాధారణమైన పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవడంలో పూర్తిగా వెనకబడిపోయింది. ఐసొలేషన్ కేంద్రాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో పెట్టినా పెద్దగా ప్రజలు వినియోగించుకోవడానికి వీలుగా అవి లేవు. అసలే రోగులు, నాలుగు అంతస్తుల భవనాలు (ఎక్కాల్సి రావడం), సరైన శానిటైజేషన్ సౌకర్యం లేదు. భోజన సదుపాయం అంతంతమాత్రమే . వీటివల్ల ప్రజలు ఈ ఐసొలేషన్ కేంద్రాల్లో నానా అగచాట్లకు గురవుతున్నారు. పెట్టుబడిదారీ దేశాల్లో యు.కె లో ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ కొనసాగుతున్నందువల్ల, చైనాలో పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నందువల్ల ఈ రెండు దేశాల్లో కరోనా పరిస్థితిని ఎదుర్కోగలిగారు. ప్రభుత్వ రంగంలో పబ్లిక్ హెల్త్ వ్యవస్థ అత్యంత కీలకమని అటు కేంద్రం, ఇటు రాష్ట్రం గుర్తించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే రూ.10 వేల కోట్లతో వ్యాక్సిన్ కోసం సన్నాహాలు జరగాలి. ఈ లోగా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. లాక్‌డౌన్ వల్ల పని కోల్పోయినవారికి నెలకు రూ.7,500 అందించాలి. కేరళ మాదిరిగా నిత్యావసర వస్తువులు ఇవ్వాలి.
కోవిడ్ మూడవ వేవ్ వస్తుందన్న వార్తలు వెలువడుతున్న తరుణంలో వైద్య రంగంలో ప్రభుత్వ చర్యలు మౌలికంగా మారాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
- వ్యాసకర్త పెనుమల్లి మధు (సిపిఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి










