Nov 25,2022 00:02

మాట్లాడుతున్న కెవిపిఎస్‌ రాష్ట్ర నాయకులు వైటి.దాస్‌

ప్రజాశక్తి-అనకాపల్లి
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ జరిగితే వాటిల్లో రిజర్వేషన్లు అమలయ్యే పరిస్థితి ఉండదని కుల వివక్ష వ్యతిరేక పోరాటం సంఘం (కెవిపిఎస్‌) రాష్ట్ర కమిటీ సభ్యులు చిరంజీవిరావు, వైటి.దాసు అన్నారు. స్థానిక దొడ్డి రామునాయుడు కార్మిక కర్షక నిలయంలో గురువారం కెవిపిఎస్‌ జిల్లా 5వ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వేషన్ల వల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో అనేక మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఇతర తరగతుల వారు ఉద్యోగాలు పొందారని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తుందని విమర్శించారు. మరోవైపు బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత దేశంలో దళితులపై దాడులు పెరిగాయని, సామాజిక వివక్ష ఎక్కువైందని తెలిపారు. అందువల్ల మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో దళితులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కెవిపిఎస్‌ స్థాపించి 25 ఏళ్లు అవుతుందని, ఈ కాలంలో అనేక దళిత సమస్యలపై పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. గ్రామాల్లో రెండు గ్లాసులు పద్ధతి, దేవాలయాల్లోకి దళితులను రానివ్వకపోవడం వంటి వివక్షలపై ఉద్యమించినట్లు చెప్పారు. కెవిపిఎస్‌ పోరాటాల ఫలితంగానే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, ఎస్సీ కమిషన్‌ ఏర్పాటయ్యాయని తెలిపారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి.వెంకన్న మాట్లాడుతూ దళితులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అమలు చేయాలని, ప్రతి దళిత కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున ప్రభుత్వ భూమి పంచాలని, ఎస్‌సి కార్పొరేటషన్‌కు నిధులు విడుదల చేయాలని, దళిత వాడలను అభివృద్ధి చేయాలని, సామాజిక భవనాలు నిర్మించాలని, దళితులకు శ్మశాన స్థలాలు కేటాయిచాలని, ఎస్‌సి ఎస్‌టి అట్రాసిటీ యాక్టును పటిష్టంగా అమలు చేయాలని, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు.
కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ప్రసాద్‌, చిరంజీవి
అనంతరం కెవిపిఎస్‌ అనకాపల్లి జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా గాడి ప్రసాద్‌, ఈరెల్లి చిరంజీవి, ఉపాధ్యక్షులుగా మంగళగిరి లోవరాజు, భూపతి అప్పారావు (పండు), సహాయ కార్యదర్శులుగా డి.చిరంజీవి, పూడి అర్జున్‌, మరో 18 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.