ప్రజాశక్తి - వినుకొండ : వినుకొండ ఘాట్ రోడ్డు వద్ద వైసిపి శ్రేణులు తొలి ఏకాదశి సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ కూలి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈపూరు మండలానికి చెందిన నాయకులు దీన్ని ఏర్పాటు చేయగా గురువారం అర్ధరాత్రి ఈదురుగాలులు వీచడంతో ప్రభ కూలి అక్కడున్న వారిపై ఇనుప ఫ్రేములు పడి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వినుకొండ పట్టణానికి చెందిన రోడ్డ అంజిరెడ్డి కుమార్తె తేజస్విని, నూజెండ్ల మండలం లింగముక్కపల్లికి చెందిన ముసిరిక నాగేశ్వర్‌రెడ్డి, ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నాయుడుపాలేనికి చెందిన శివరాం తీవ్రంగా గాయడ్డారు. తేజస్విని, నాగేశ్వర్‌రెడ్డికి వెన్నెముక, కాళ్లు దెబ్బతిన్నాయని, శివరామ తలకు తీవ్ర గాయమైందని, వీరు గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషయమంగా ఉందని బంధువులు తెలిపారు. వీరితోపాటు పలువురు గాయా లతో ఆస్పత్రుల్లో చేరారు. ఇదిలా ఉండగా 10 భారీ విద్యుత్తు ప్రభలకు అనుమతులు ఇచ్చిన అధికారులు వాటివద్ద రక్షణ చర్యల పర్యవేక్షణలో విఫలం కావడమే ప్రమాదానికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.










