Feb 19,2021 07:27

మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయడంతోపాటు విద్యుత్‌ చట్ట సవరణలను ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా రైతులు గత మూడు నెలలుగా ఉద్యమిస్తున్నా వాటిని బేఖాతరు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు చర్చ పేరిట రాష్ట్రాల విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి చెయ్యడం బరితెగింపే! ప్రభుత్వ రంగంలోని విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కాం) లైన్లు, నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని ప్రైవేట్‌ డిస్కాములను సమాంతరంగా ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం బెదిరించడం దారుణం. తనకు నచ్చిన డిస్కాంను ఎంపిక చేసుకునే అవకాశం విద్యుత్‌ వినియోగదారుకు ఇవ్వాలన్న కేంద్రం వాదన 'చెట్టు ఎందుకెక్కావంటే దూడ గడ్డి కోసం' అన్నట్టుంది. ఈ సాకుతో పంపిణీ రంగ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తోంది. 1990వ దశకంలో ప్రారంభమైన సంస్కరణలతో విద్యుదుత్పాదన (జెన్‌కో) రంగ ప్రైవేటీకరణ గరిష్ట స్థాయికి చేరుకోగా ఇప్పుడు పంపిణీ రంగాన్ని ప్రైవేటుకు కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం తెగబడింది. క్రాస్‌ సబ్సిడీలు ఎత్తివేయడం లేదా తీవ్రంగా తగ్గించడం, రాయితీలిచ్చినా అవి నగదు బదిలీగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలనడం వంటి ప్రతిపాదనలను కేరళ, తెలంగాణతో సహా 13 రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా వ్యతిరేకించాయి. వ్యవసాయానికి ఉచిత లేదా చౌక విద్యుత్‌, దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాలకు ఉచితంగా, సాధారణ గృహ వినియోగదారులకు తక్కువ రేటుతో సరఫరా చేస్తున్న పరిస్థితి కనుమరుగవుతుందన్న రాష్ట్రాల వాదన ముమ్మాటికీ నిజం. అయినా అభ్యంతరాలను తోసి రాజంటూ హస్తిన పాలకులు చట్ట సవరణకు యత్నిస్తూనే ఉన్నారు. తాజాగా తెచ్చిన సవరణలను కనీసం కేంద్ర విద్యుత్‌ శాఖ వెబ్‌సైట్‌లో కూడా ఇంతవరకూ ప్రచురించలేదంటే అందులో ఏమున్నదీ ఎవరికీ తెలియకుండా చేయాలన్న దురాలోచన దాగివున్నట్టే కదా!
ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటైన పంపిణీ వ్యవస్థపై ప్రైవేట్‌ గుత్తాధిపత్యం ఏమిటని బుధవారంనాటి వీడియో కాన్ఫరెన్స్‌లో దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా ప్రశ్నించడం స్వాగతించదగిన విషయం. తమకు పోటీగా ప్రైవేటు డిస్కాములను ఏర్పాటు చేసే ప్రతిపాదనపౖౖె అనేక రాష్ట్రాల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా కేంద్ర మంత్రి మొండిగా వ్యవహరించడం అమానుషం. ఆదాయం ఎక్కువ ఉన్న ప్రాంతాలను ప్రైవేట్‌కు అప్పగిస్తారని, దీనివల్ల తాము నష్టపోతామనీ, ఉద్యోగుల పరిస్థితి ఏమవుతుందని వారంటుంటే 'వినియోగదారుడికి డిస్కాంలను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడానికి మీరు వ్యతిరేకమా' అని రాష్ట్రాల అధికారులను గద్దించడం అమాత్యవర్యుని ప్రైవేటు పక్షపాతానికి నిదర్శనం. టెలికాం రంగం మాదిరిగా విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరిస్తే వినియోగదారులకే మేలు జరుగుతుందని, కొత్త ఉద్యోగాలు వేలల్లో వస్తాయని వకాల్తా పుచ్చుకోవడం అన్యాయం. ప్రైవేట్‌ కంపెనీలకు అవసరమైన నెట్‌వర్క్‌, లైన్లు అంతా కూడా ప్రభుత్వ డిస్కాంల నుంచే వాడుకుంటాయని మంత్రి చెప్పడం 'తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం'లా ఉంది. ఇందుకు కొంత నగదు ప్రైవేట్‌ కంపెనీలు డిస్కాంలకు చెల్లిస్తాయని, నిర్వహణ అంతా డిస్కాంలే చూడాలనడం దుర్మార్గం. సౌర, పవన వంటి సంప్రదాయేతర విద్యుత్‌ను ఎక్కువగా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం షరతులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వాలకు గుదిబండ అవుతుంది. ప్రభుత్వరంగం లోని థర్మల్‌ స్టేషన్లు నిరుపయోగమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు సంప్రదాయేతర విద్యుత్‌ను అధిక ధరకు కొనుగోలు చేసి నష్టపోయిన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని మరింత పెంచడం ప్రైవేటుకు లబ్ధి చేకూర్చడానికే!
కేంద్రం తెస్తున్న విద్యుత్‌ చట్ట సవరణలతో వ్యవసాయానికి, పేదలకూ తీవ్ర నష్టం కలుగుతుంది కనుక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగులు, కార్మికులేగాక విద్యుత్‌ అధికారులు సైతం ఆందోళనగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్‌ చట్ట సవరణలకు వ్యతిరేకంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కలిసి కేంద్రాన్ని ప్రతిఘటించాలి. అన్ని శక్తులూ సంఘటితమై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలను తిప్పికొట్టాలి.