Dec 19,2022 23:35

సర్పంచ్‌లు, రైతులతో సమావేశమైన గోవాడ సుగర్స్‌ ఎమ్‌డి సన్యాసినాయుడు

ప్రజాశక్తి-దేవరాపల్లి
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చెరకు రైతులు మోసపోవద్దని గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సన్యాసినాయుడు హితవుపలికారు. మండలంలోని తెలుగుపూడి గ్రామ సచివాలయం వద్ద సోమవారం తెనుగుపూడి, వెంకటరాజపురం, మారేపల్లి, గరిసింగి గ్రామాల సర్పంచ్లు అధ్వర్యంలో సభ్య రైతులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది టన్ను చెరకుకు రూ.2,821 మద్దతు ధర ఇస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు ఫ్యాక్టరీలు, ప్రైవేట్‌ బెల్లం క్రషర్లకు కాకుండా ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేయాలని సూచించారు. ఫాక్టరీ యాజమాన్యం వారం రోజుల లోపల తెనుగుపూడిలో ఈ క్రషింగ్‌ సీజన్‌కు తాత్కాలిక చెరకు కొనుగోలు కేంద్రం (కాటా) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకొని లాభం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు బూరె బాబురావు, గూడేపు రాము, దాసరి సంతోష్‌ కుమార్‌, అవుగడ్డ కన్నతల్లి, ఎంపీటీసీలు అవుగడ్డ రమాదేవి, వైసిపి నాయకులు అవుగడ్డ రామ్మూర్తినాయుడు, ఫ్యాక్టరీ చెరకు అభివృద్ధి అధికారి కలిమి రామం, చెరకు కొనుగోలు కేంద్రం వ్యవసాయ అధికారి కృష్ణమూర్తి, ఫీల్డ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.