ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు దాదాపు 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు, ఆఫీసర్లు సమ్మె చేశారు. ఆ మరుసటి రోజున జనరల్ ఇన్సూరెన్స్ ఉద్యోగులు తమ విధులను బహిష్కరించారు. 18వ తేదీన ఎల్‌ఐసి ఉద్యోగులు సమ్మె చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వరుసగా ఈ సమ్మెలు జరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటించారు. నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకదాన్ని విక్రయిస్తామని కూడా చెప్పారు. ఎల్‌ఐసిలో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించేందుకు ఐపిఓ కు కూడా వెళ్ళనున్నారు. దీంతోపాటు బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల వాటాను 74 శాతానికి పెంచనున్నారు. సంబంధిత బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర కూడా లభించింది. పార్లమెంట్‌లో కూడా ప్రవేశపెట్టారు.
ఈ చర్యలతో ఆర్థిక రంగ సరళీకరణలో కీలకమైన మలుపుకు చేరుకున్నాం. 1991లో సరళీకరణ విధానాలు ప్రారంభించినప్పటి నుండి ప్రైవేటువారికి ఆర్థిక రంగ ద్వారాలు తెరవడం ఒక లక్ష్యంగా వుంది. బ్యాంకులు ప్రభుత్వ యాజమాన్యంలో వుండడం నయా ఉదారవాద వ్యవస్థలో ఆమోదయోగ్యం కాదు.
1969లో 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయీకరణ చేశారు. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమమైంది. గ్రామీణ ప్రాంతాలకూ బ్యాంకింగ్ నెట్‌వర్క్ విస్తరించింది. అయితే 1991 నుండి, బ్యాంకింగ్ రంగానికి ద్వారాలు తెరవాలంటూ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నుండి ప్రభుత్వాలకు ఒత్తిళ్ళు వస్తూనే వున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాలు ఉపసంహరించడం, ప్రైవేటు బ్యాంకులకు అనుమతించడం, విదేశీ బ్యాంకుల కార్యకలాపాలకు అనుమతించడం వంటి వాటిని ప్రభుత్వాలు మొదలెట్టాయి. యుపిఎ-1, యుపిఎ-2 ప్రభుత్వ హయాంలో ఈ దిశగా సాగిన ప్రతి ఒక్క చర్యకూ బ్యాంకింగ్ యూనియన్లు, కార్మికోద్యమం, వామపక్షాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.
కేవలం ఈ ప్రతిఘటనా చర్యల వల్లనే ఆర్థిక రంగం లోకి మొత్తంగా విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తలేదు. 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తలెత్తినపుడు కూడా పెద్ద అడ్డుగోడలా నిలిచి భారత ఆర్థిక వ్యవస్థను కాపాడింది ఈ ప్రతిఘటనా చర్యలే. యుపిఎ-2 ప్రభుత్వ హయాంలో బీమా రంగంలో కూడా ఇదే క్రమం ప్రారంభమైంది. బీమా రంగంలో 26 శాతం ఎఫ్‌డిఐ ని అనుమతించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే వామపక్షాల తీవ్ర వ్యతిరేకత కారణంగా అమలు కాలేదు. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పడినపుడు 26 శాతం ఎఫ్‌డిఐ నిబంధనలను అమలు పరిచారు. 2015లో మోడీ ప్రభుత్వం దీన్ని 49 శాతానికి పెంచింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్రమంగా పెద్ద మొత్తంలో నిరర్ధక ఆస్తులు (ఎన్‌పిఎ) పెరిగిపోతూ వచ్చాయి. 2021లో మొత్తం బ్యాంకుల ఆస్తుల్లో ఎన్‌పిఎ ల వాటానే 13.5 శాతం వుంటుందని భావిస్తున్నారు. యుపిఎ ప్రభుత్వం నాటి నుండి వరుసగా ఏర్పడిన ప్రభుత్వ విధానాల వల్ల బ్యాంకులు ఈ ఎన్‌పిఎ లను భరించాల్సి వస్తోంది. మోడీ ప్రభుత్వ హయాంలో ఇవి మరింత పెరిగాయి. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల పేర...జాతీయ బ్యాంకులు కార్పొరేట్ సంస్థలకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాల్సి వుంటుంది. ఈ రుణాల్లో చాలా వరకు పారు బకాయిలుగా మారతాయి.
2014 నుండి ఇటువంటి పారు బకాయిల్లో రూ. 6.6 లక్షల కోట్లను మోడీ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. ఇప్పుడు, ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల, బ్యాంకులను కొల్లగొట్టిన సదరు కార్పొరేట్ సంస్థలే ఆ బ్యాంకులను స్వాధీనం చేసుకోవడానికి దారితీస్తుంది.
బ్యాంకింగ్, బీమా రంగాలను ప్రైవేటీకరించడానికి మోడీ ప్రభుత్వం సర్వ శక్తులను ఒడ్డుతోంది. దీనితో పాటు, వివిధ రకాల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం దగ్గర బృహత్తర ప్రణాళిక ఒకటి వుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ చర్యలు చేపట్టడమంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆదేశాలకు నిస్సిగ్గుగా లొంగిపోవడమే.
ఇప్పటి వరకు సామాజిక, ప్రభుత్వ నియంత్రణలో వున్న ప్రజల పొదుపు మొత్తాలు, ప్రభుత్వ వనరులను ఆర్థిక-కార్పొరేట్ సామ్రాజ్యానికి అప్పగించాల్సి వుంటుంది. కార్పొరేట్ సంస్థలు బ్యాంకులను ప్రారంభించేందుకు అనుమతించాలంటూ కొద్ది నెలల క్రితమే, ఆర్‌బిఐ అంతర్గత వర్కింగ్ గ్రూపు సిఫార్సు చేసింది. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత మూడు దశాబ్దాలుగా బ్యాంకింగ్, బీమా యూనియన్లు సాహసోపేతమైన పోరాటం చేస్తున్నాయి. కేవలం ఈ ప్రతిఘటన కారణంగానే సరళీకరణ విధానాల క్రమం మందగించింది. ఇప్పుడు, ఈ కొత్త చర్యలను అమలు చేసేందుకుగాను పార్లమెంట్‌లో ప్రభుత్వానికి మెజారిటీ వుండడంతో...ఈ యూనియన్లు అతి పెద్ద సవాలును ఎదుర్కొంటున్నాయి.
అందువల్ల, ముఖ్యంగా బ్యాంకింగ్, బీమా రంగాల ఉద్యోగులు తమ పోరాటాన్ని ఉధృతం చేయడం ఇప్పుడు అవసరం. ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ చర్యలను నిరసిస్తూ సాగే విస్తృత పోరాటాలతో వీటిని ముడిపెట్టడం ద్వారా మరింత బలోపేతం చేయాల్సి వుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసే పోరాటం ప్రజా పోరాటంగా మారాలి. అన్ని లౌకిక, ప్రజాతంత్ర ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా తమ ఎజెండాలో దీన్ని లేవనెత్తాలి. లక్షలాదిమంది బ్యాంక్ ఉద్యోగులు, ఇన్సూరెన్స్ ఉద్యోగులు తమ పోరాటాలను కొనసాగిస్తూనే, ఈ నమ్మకద్రోహానికి గాను బిజెపి తగిన రాజకీయ మూల్యం చెల్లించేలా చూడాల్సి వుంది.
బ్యాంకు, బీమా ఉద్యోగులు, వీరి కుటుంబాల్లో కొద్దిమంది 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి కి ఓటు వేసి వుంటారు. త్వరలో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కి వ్యతిరేకంగా ఓటు వేసేలా వీరిని, వీరితోపాటు ఇతరులను కూడా సమీకరించాల్సి వుంది. హిందూత్వ-జాతీయవాద శక్తుల తప్పుడు స్వభావాన్ని ఎండగట్టేందుకు సమర్ధవంతమైన రీతిలో రాజకీయ ప్రచారాన్ని చేపట్టాల్సి వుంది. అమూల్యమైన జాతి సంపదను, విలువైన దేశ వనరులను అయిన కాడికి అమ్మేస్తే మన జాతీయ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడుతుంది. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై రాజీ పడాల్సి వస్తుంది. ప్రజలను మరింతగా ఆర్థిక దోపిడీకి గురిచేసినట్లవుతుంది. బడా కార్పొరేట్లు, వారి విదేశీ భాగస్వాముల ఇష్టాలకు దేశం తలొగ్గేలా చేస్తూ 'ఆత్మ నిర్భర్ భారత్' గురించి మాట్లాడే ప్రభుత్వమిది.
/'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం/










