Oct 03,2023 22:50

  • కార్మిక కర్షక ఐక్యవేదిక ఆధ్వర్యంలో మానవహారం

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా): వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, బహుదేశ కార్మిక పోరాటాలకు సంఘీభావంగా కార్మిక కర్షక ఐక్యవేదిక కృష్ణాజిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రేవతి సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల వెంకటేశ్వరావు మాట్లాడుతూ మనువాద, మతోన్మాద బిజెపి ప్రభుత్వం నుంచి భారత రాజ్యాంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానం నుండి కాపాడుకొనుటకు మరో స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించాలని, ఇది కార్మిక, కర్షక, ప్రజల ఐక్యత పోరాటాలతో సాధ్యమవుతుందన్నారు. ఈ దేశంలో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయని పరిస్థితి నెలకొందన్నారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఉందని, దేశంలో నిరుద్యోగం మరింత పెరుగుతుందని, కార్మికుల కనీస వేతనాలు కోసం ఆందోళన చేస్తే వాటిని అణచివేసే విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య హక్కులను ఖూనీ చేస్తున్నాయన్నారు. ఎఐటియుసి జిల్లా నాయకులు లింగం ఫిలీప్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల, కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను మానుకోవాలన్నారు. తెలుగు రైతు సంఘం నాయకులు గోపు సత్యనారాయణ మాట్లాడుతూ చారిత్రిక రైతు పోరాటం సందర్భంగా రైతులపై పెట్టిన తప్పుడు కేసులను ఇప్పటికైనా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. ఏఐఎఫ్టీయూ న్యూ నాయకులు వెంకట్రామయ్య మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇచ్చిన జగన్‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనిన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసి నాయకులు కె.చంద్రశేఖర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి పవన్‌, సిఐటియు జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం, ఎల్‌ఐసి యూనియన్‌ మచిలీపట్నం డివిజన్‌ ప్రధాన కార్యదర్శి జి.కిషోర్‌కుమార్‌, టీ చంద్రపాల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ యూనియన్‌ నాయకులు ఎ.ఏడుకొండలు, యునస్‌, ఎల్‌ఐసి రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నాయకులు ఎస్‌.ధనుంజయరావు, పి నాగయ్య, అంగన్వాడి నాయకురాలు టి.సుజాత పాల్గొన్నారు.