ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ఒడిస్సా రాష్ట్రంలో బాలాసోర్ వద్ద సంభవించిన రైలు ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులకు ఆదివారం బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. గాయపడిన వారికి సత్వరమే వైద్య సహాయం అందేలా చూడడం ద్వారా మృతుల సంఖ్య పెరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. మూడు రైళ్లు ఢకొీన్న ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది తెలియడం కోసం సమగ్ర దర్యాప్తు చేయించాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ విధానాలు వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రయాణికుల భద్రతను గాలికి వదిలి,లాభాలు కోసం ప్రయత్నం చేయటం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న ఆయన సొంత రాష్ట్రంలోనే ఇటువంటి ఘటన జరగటం దురదృష్టకరమని అన్నారు. రైల్వేల ప్రైవేటీకరణ కాకుండా ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ మజుందార్, నాయకులు ఎన్ కోటేశ్వరావు, నాగేశ్వరరావు, భాస్కరరావు, ప్రసాద్, సుభాషిణి, జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు.
చీరాల: ఒరిస్సాలోని బాలసూర్ వద్ద జరిగిన రైల్వే ప్రమాద మృతులకు సిపిఎం చీరాల పట్టణ కమిటీ ఘనంగా నివాళులు అర్పించారు. చీరాల రైల్వే స్టేషన్ వద్ద జారిన కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు మాట్లాడారు. చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సిగలింగ్ వ్యవస్థ వైఫల్యంతోనే ప్రమాదం జరిగిందన్నారు. రైల్వేలో లక్షల పోస్టుల ఖాళీలు భర్తీ చేయకుండా ఉన్న కార్మికులపై పనిభారం పెంచడం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదంలో 300 మంది మరణించారని, 900 మంది గాయపడ్డారని అన్నారు. మూడు రైళ్లు ఒకే చోట ఒకదానికొకటి ఢకొీనటం దురదృష్టకరమన్నారు. రైళ్ల ప్రమాదానికి సాంకేతిక వైఫల్యం, మానవ తప్పిదాలే ప్రధాన కారణంగా కనిపిస్తుందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. వెంటనే రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం వసంతరావు, పి కొండయ్య, శీలం రవికుమార్, ఎం లక్ష్మి, భారతి, పి కిరణ్, పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










