Mar 16,2021 06:20

నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు, ఎల్‌ఐసి లలో వేతన సవరణ అమలుకాక 43 నెలలైంది. 16 శాతం పెంపుదలతో జీవిత బీమా సంస్థలో నిర్ణయాత్మక దశలో వేతన సవరణ ఉంటే...కనీసం చర్చలకు కూడా పిలవని వైనం 'జిప్పా' (జనరల్‌ ఇన్సూరెన్స్‌ పబ్లిక్‌ సెక్టార్‌ అసోసియేషన్‌) సాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుండి ఇంకా అనుమతి రాలేదని 'జిప్సా' చెబుతూనే ఉంది.


జీతాల్లో ఎక్కువ పెంపుదల అడుగుతున్న ఉద్యోగుల కోర్కె వెనుక...వారి పని తీరు, సాధించిన ఫలితాలు అద్భుతంగా ఉండడమేనని గమనించాలి. అమోఘమైన వారి కృషి వల్లే నాలుగు ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీల గణాంకాలు ప్రతి సంవత్సరం రెట్టింపు అయ్యాయి. 2012-17 మధ్య కాలంలోనే కాదు. తరువాత కూడా గణనీయంగా మెరుగుదలను చూడవచ్చు.


నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల స్థూల జాతీయ ప్రీమియం ఆదాయం (జి.డి.పి) 2012-13లో రూ. 35,022 కోట్లు ఉండగా 2017-18 కాలానికి అది రూ. 67,794 కోట్లకు చేరింది. మొత్తంగా పెరుగుదల 14.12 శాతం కాగా సంపూర్ణంగా 93.57 శాతం వృద్ధి సాధించింది (సరాసరి పెరుగుదల రేటు 18.71 శాతం). భారతదేశ ఆర్థిక సూచి 5-6 శాతం మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఈ నాలుగు కంపెనీలు ఎంతో అభివృద్ధి సాధించాయని గమనించాలి. మార్కెట్లో విపరీతమైన పోటీ ఉన్నా దాన్ని తట్టుకొని ఈ నాలుగు కంపెనీలు తమ ఆధిపత్యాన్ని చాటాయి. ఆర్థిక రంగం బాగా మందగమనంలో ఉన్నా ఇవి మంచి అభివృద్ధిని చూపాయి. ఏవైనా కొన్ని ఇబ్బందులు కలిగాయంటే... ప్రభుత్వం భవిష్యత్తులో వీటి పెట్టుబడులను ఉపసంహరించడం కోసం అధికంగా ప్రోవిజన్లు పెట్టించడంవల్ల కలిగినవే కాని... వ్యాపార లేమి వల్ల కాదన్న విషయం మరువరాదు. పరిశ్రమలో, బయట ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూనే ఇంతటి దృఢమైన పెరుగుదలను ఈ నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు సాధించాయంటే కారణం ఇందులో అంకిత భావంతో కస్టమర్‌ సేవలకై పని చేస్తున్న ఉద్యోగులేనని చెప్పాలి. కార్యాలయాలు పెరిగిపోయి...ఉద్యోగులను తగ్గించిన పరిస్థితుల్లోనూ ఇది సాధించారు. 2012-18 మధ్య కాలంలో కార్యాలయాలు 6134 నుండి 8296 కు పెరగగా, 13317 కొత్త రిక్రూట్‌మెంట్లు (అసిస్టెంట్లు 7831, ఆఫీసర్లు 5486) జరిగినా ఉద్యోగుల సంఖ్య 65710 నుండి 60982 కు తగ్గింది. మార్చి 31, 2020 నాటికి ఆఫీసుల సంఖ్య 7552 కాగా...ఉద్యోగుల సంఖ్య గణనీయంగా 53669 కు (కొత్తగా 6085 ఆఫీసర్లు, 8684 అసిస్టెంట్లు కలుపుకొని) తగ్గింది. ఒక పక్క ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ ఉన్నా ప్రీమియం ఆదాయం అసాధారణంగా పెరగడం వల్ల సగటున ఒక ఉద్యోగి ఆర్జిత ప్రీమియం 2012-13 లో రూ. 53.3 లక్షలు ఉండగా, అది 2017-18 నాటికి రూ.1.11 కోట్లుగాను, తరువాత ఇంకా పెరిగి రూ.1.37 కోట్లుగాను (అన్ని అంకెలు జి.డి.పి.ఐ లెక్కలుగా గమనించాలి) ఉంది. ఈ రోజు ప్రభుత్వ రంగ సాధారణ బీమా ఉద్యోగి ఉత్పాదకత దేశంలో అధికంగా ఉన్న ప్రయివేటు సాధారణ బీమా ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉందని గ్రహించాలి. మేనేజిమెంటు, ప్రభుత్వ ద్వయానికి ఇంతకన్నా ఇంకేమి కావాలన్న ప్రశ్న వేయాలని అందరికీ అనిపిస్తుంది.


విపరీతమైన పోటీ పరిస్థితుల్లో నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలు ఒక పక్క 40 శాతం పైగా మార్కెట్‌ భాగస్వామ్యం తెస్తూనే, అసాధారణమైన ఉత్పాదకతను ఇచ్చాయి. కస్టమర్లకు ఉద్యోగులు ఏవిధమైన సేవలు అందిస్తున్నారన్నది దీన్నిబట్టే అర్ధమౌతుంది. క్లెయిమ్‌ సర్వీసు బీమా ఉద్యోగుల పనితనానికి ఒక తార్కాణంగా చెప్పుకోవాలి. 2016-17 సంవత్సరంలో సాధారణ బీమా కంపెనీలలో న్యూ ఇండియా అధికంగా 70.97 శాతం క్లెయిములు పరిష్కరించగా ప్రయివేటు రంగంలో పెద్దవిగా చెప్పుకునే రెండు సాధారణ బీమా కంపెనీలు 64.38 శాతం, 59.47 శాతం ఉన్నాయి. 2018-19 లో నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు కలిపి పరిష్కరించిన క్లెయిములు 1.79 కోట్లు. అది అన్నింటికి కలిపి 88.30 శాతం. ఒకే ఒక్క ప్రయివేటు కంపెనీ ఈ శాతాన్ని అందుకోగలిగింది. అయితే దాని విషయంలో క్లెయిముల సంఖ్య చాలా తక్కువగా ఉంది. క్లెయిముల పరిష్కారాలకు సంబంధించి 2019-20 లో నాలుగు ప్రభుత్వ కంపెనీలు మరింత మెరుగుదలను చూపాయి. 1.97 కోట్ల క్లెయిములు 85.44 శాతం పరిష్కారం అయ్యాయి. అటుపక్క చూస్తే అతి పెద్ద ప్రయివేటు కంపెనీ 16.80 లక్షల క్లెయిములు 80.40 శాతం మాత్రమే ఉంది. 2012-13 లో నాలుగు ప్రభుత్వ రంగ కంపెనీలు 59.77 లక్షల నుండి 2019-20 సంవత్సరానికి 1.97 కోట్ల క్లెయిములు పరిష్కరించింది. అంటే ఆ పరిష్కారాలు మూడు రెట్లు పెరిగాయన్నమాట. అంతేకాక వీటి మొత్తం ఆస్తులు 2012-13 లో రూ. 1,14,583 కోట్లు ఉండగా, 2019-20 నాటికి రూ. 1,77,715 కోట్లకు పెరిగాయి. అదే కాలానికి వీటి పెట్టుబడులు రూ.86,748 కోట్ల నుండి రూ.1,22,035 కోట్లకు పెరిగాయి. ఈ నాలుగు కంపెనీలు ప్రభుత్వానికి రూ.3,545. 18 కోట్ల డివిడెండు చెల్లించాయి.


ఇంతటి ఘనమైన గణాంకాలు...నాలుగు కంపెనీల ఉద్యోగుల కృషిని తెలుపుతుంటే... వేతన సవరణ చర్చలు ముందుకు కదలకపోవడం బాధ కలిగిస్తుంది. వేతన సవరణ అన్నది రాజకీయ అంశమని ఎ.ఐ.ఐ.ఇ.ఎ ఎప్పటి నుండో చెప్తోంది. నాలుగు ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నాయన్న రంగు పులమడంలో ఒక సమిష్టి రాజకీయ ఎత్తుగడ కనిపిస్తోంది. నగదు ప్రవాహం విషయంలో కూడా ఈ నాలుగు కంపెనీలు ఏమీ తక్కువగా లేవు. ప్రభుత్వం వాటిని గంపగుత్తగా అమ్మేయడానికి సిద్ధమైనందువల్ల వాటి బ్యాలెన్స్‌ షీటుల్లో ప్రభుత్వ ప్రమేయం వల్ల తక్కువగా చూపుతున్నాయి. మూడు కంపెనీలను కలిపే ప్రక్రియను ప్రభుత్వం అటకెక్కించినప్పుడే 2020 జూలై నాటికే ఎ.ఐ.ఐ.ఇ.ఎ ఈ విషయాన్ని పసిగట్టింది. ఇప్పుడేమో ఆర్థిక మంత్రి ఒక ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీని ప్రయివేటు పరం చేస్తామని తమ బడ్జెట్‌లో పేర్కొన్నారు. అందువల్లే ఈ నాలుగు కంపెనీలు బలవంతంగా ప్రావిజన్లను పెంచి ఐబిఎన్‌ఆర్‌ (క్లెయిములు వచ్చి రిపోర్ట్‌ కానివి) గాను ఐబిఎన్‌ఇఆర్‌ (క్లెయిములు వచ్చి సరైనంతగా రిపోర్టు కానివి) టెక్నికల్‌ రిజర్వులు పెట్టారు. సహజంగానే ఇవన్నీ కలిసి మూడు కంపెనీల పరపతి నిష్పత్తి (సాల్వెన్సీ రేషియో)పై ప్రతికూల ప్రభావాన్ని కలగజేసి ఐ.ఆర్‌.డి.ఎ నిర్ణయించిన నిష్పత్తి 1.5 కంటే తక్కువగా ఉండేటట్టు చేశారు. అందుకే అదనపు పెట్టుబడినిచ్చి ఈ పరపతి నిష్పత్తిని పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు కంపెనీలు తమ ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరచుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి దాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశలో ఉన్నాయి.


ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలలో ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్ల సంయుక్త ఫోరం (జె.ఎఫ్‌.టి.యు) 2021 ఫిబ్రవరి 3వ తేదీన ఒక గంట వాకవుట్‌ సమ్మె, ఫిబ్రవరి 24వ తేదీన రెండు గంటల వాకవుట్‌ సమ్మె చేశాయి. ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేశారు. ఏ ఒక్క ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీని ప్రయివేటీకరించరాదని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని 49 శాతం నుండి 74 శాతానికి పెంచరాదని తమ నిరసనను గట్టిగా తెలియజేశాయి. వేతన సవరణను త్వరగా పూర్తి చేయాలన్న డిమాండుతో పాటు ఫ్యామిలీ పెన్షన్‌ను అందరికీ 30 శాతం చేయాలని, 1995 పెన్షన్‌ పథకానికి మెరుగులు దిద్దాలని, నూతన పెన్షన్‌ పథకాన్ని (ఎన్‌.పి.ఎస్‌) రద్దు చేసి అందరికీ 1995 పెన్షన్‌ పథకాన్ని అమలు చేయాలని, సాధారణ బీమాలో ప్రభుత్వ కంపెనీలను ప్రయివేటీకరించే ఎటువంటి చర్య తీసుకోరాదని కోరాయి. ఈ డిమాండ్ల సాధన కోసమే రేపు (మార్చి 17న) ఒక రోజు సమ్మె చేయనున్నాం.
                                        * సంజయ్‌ ఝా - వ్యాసకర్త ఎఐఐఎ స్టాండింగ్‌ కమిటీ కార్యదర్శి