ప్రభుత్వ రంగంతో పాటు దేశ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టడం ద్వారా తగిలిన ఎదురుదెబ్బల నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆవైపు నుంచి యుటర్న్ తీసుకుంటున్నాయి. అయితే, మన దేశంలోని మోడీ సర్కార్ మాత్రం ప్రయివేటీకరణ వైపు పరుగులు తీస్తూ దేశ ఆర్థిక రంగాన్ని ప్రమాదంలోకి నెట్టివేసే నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో ప్రస్తుతం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ఆరాటం చూస్తుంటే భారత రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బ తింటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని విధాలుగా సామాజిక న్యాయాన్ని కల్పించే రాజ్యాంగం లోని ఆర్టికల్ 38(1)ను అమలు చేయడంలో ప్రభుత్వ రంగ సంస్థలే కీలకం. ఆర్టికల్ 39 (బి) ద్వారా ఖనిజ వనరులపై ప్రభుత్వానికి ఉండే యాజమాన్యం, నియంత్రణను ప్రైవేటీకరణ దెబ్బ తీస్తోంది. ఇదే సమయంలో భారత్‌లో 60 శాతం మంది బిలియనీర్లు ఇటువంటి రంగాల నుంచే పెద్దయెత్తున సంపదను పోగేసుకుంటున్నారన్న విషయం అదితి గాంధీ, మైఖేల్ వాల్టన్ అధ్యయనంలో తేలింది.
రిజర్వేషన్ల ద్వారా బలహీన వర్గాల విద్యతో పాటు ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 46(సి)కి కూడా ప్రభుత్వ రంగ సంస్థలే మార్గం చూపిస్తున్నాయి. పిఎస్‌యులు కల్పించిన అవకాశంతో ఒకతరంలో కొంత మంది రైతులు పారిశ్రామిక కార్మికులుగా మారామని చెప్పారు. దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలంటే ప్రభుత్వ రంగ సంస్థ (ఎఫ్‌సిఐ) ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వహించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్న డిమాండ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న రైతు ఉద్యమం చెబుతోంది.
ప్రభుత్వ అధీనంలోని రక్షణ, ఇంధన రంగాలు భారత్‌కు యుద్ధ సమయాల్లో వెన్నుదన్నుగా ఉన్నాయి. అటువంటి వాటిని ప్రైవేటుకు కట్టబెట్టడం అంటే దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతుంది. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో బహుళజాతి పెట్రోలియం కంపెనీలు భారత ప్రభుత్వానికి సహకరించలేదు. దేశంలో ఇంధన భద్రతను ప్రభుత్వ రంగమే కల్పించింది. 1974, 1979 ఇంధన సంక్షోభాలను అధిగమించింది. ఇటువంటి సమయంలో దేశంలో రెండో అతి పెద్ద చమురు కంపెనీగా ఉన్న బిపిసిఎల్‌ను ప్రైవేటుపరం చేయడం శ్రేయస్కరం కాదు. ధర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మించిన దాదాపు 34 మంది ప్రైవేట్ వ్యక్తులు చైనా నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలను బిహెచ్‌ఇఎల్ నాలుగు సంవత్సరాల ఉత్పత్తికి సమానం. పర్యావసానంగా బిహెచ్‌ఇఎల్ డిసెంబర్ త్రైమాసికంలో రూ.217 కోట్ల నష్టాలను చవిచూసింది. దీనికి పరిష్కారం ఆ సంస్థను ప్రైవేటుపరం చేయడమేనా? భారత ప్రభుత్వ తీరుకు విరుద్ధంగా బొగ్గు, విద్యుత్ పరికరాల్లో చైనా ముందడుగు వేసింది. ప్రభుత్వ అనుబంధ బ్యాంకులు, ఎగుమతి రుణాల ద్వారా ప్రోత్సహించబడిన చైనా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రముఖ ఎగుమతిదారులుగా ఎదిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో లాభాల్లో ఉన్న విద్యుత్ పంపిణీ వ్యవస్థ లోని వంద శాతం షేర్లను అమ్మడం ద్వారా ప్రైవేటు గుత్తాధిపత్యం ఏర్పడుతుంది. దీని ద్వారా ఛార్జీల విషయంలో విచ్చలవిడిగా ప్రవర్తించే అవకాశం ఉంది.
ప్రస్తుత ప్రభుత్వం కేవలం సంస్థలను మాత్రమే ప్రైవేటుపరం చేయడం లేదు. టెలికాం, విమానయానం, విద్యుత్‌తో ప్రారంభించి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థనే కార్పొరేట్ల చేతుల్లో పెట్టే ప్రమాదకర ధోరణిలో వెళుతోంది. ఫార్చ్యూన్ టాప్ 500 కంపెనీల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలే 35 శాతం ఉన్నాయి. వాటిలో 100 చైనాకు చెందిన పిఎస్‌యులే. పిఎస్‌యులను వ్యూహాత్మకంగా వినియోగించుకోవడం వలనే చైనా ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు పిఎస్‌యులను బలోపేతం చేసుకోవడం ద్వారా అభివృద్ధి బాటలో పయనిస్తుంటే మన ప్రభుత్వం మాత్రం బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ అవలంభించిన నయా ఉదార విధానాల యుగం వైపు పరుగు తీస్తోంది.
సంస్థల లాభాలే వాటి సామర్ధ్యాన్ని ప్రస్ఫుటం చేస్తాయి. లాభాల్లో ఉన్న పిఎస్‌యుల నికర ఆదాయం రూ.1.6 లక్షల కోట్లు ఉండగా, వాటి డివిడెంట్లు రూ.77 వేల కోట్ల మేర ఉన్నాయి. ఇదే సమయంలో కొన్ని పిఎస్‌యుల నష్టాలు రూ.34,800 కోట్లు మాత్రమే ఉన్నాయి. ప్రైవేటీకరణ ద్వారా ప్రస్తుత, భవిష్యత్తు లభాలను ఎందుకు వదులుకోవాలి. భారత స్థూల మూలధన పెట్టుబడి (జిసిఎఫ్)లో దాదాపు 24 శాతం పిఎస్‌యుల జిసిఎఫ్‌నే ఉంది. మరోవైపు ప్రైవేటు రంగం 2019, సెప్టెంబర్ 30 నాటికి రూ.7.27 లక్షల కోట్ల రూపంలో బ్యాంకులకు నిరర్ధక ఆస్తుల రూపంలో బాకీ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో రాజకీయ స్వాతంత్య్రానికి ఆర్థిక స్వాతంత్య్రం అవసరం. ప్రజల ఆస్తులకు ప్రభుత్వం రక్షణగా నిలవాలి.
కె. అశోక్ రావ్(వ్యాసకర్త ప్రభుత్వ రంగ అధికారుల సంఘ నాయకులు)










