Sep 02,2021 06:07

'మోనిటైజేషన్‌ ప్రకటించే ముందు ఆస్ట్రేలియా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నారా?' అంటూ మీడియాలో వచ్చిన ఒక విశ్లేషణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మోనిటైజేషన్‌ అంటే ప్రయివేటీకరణ లేదా నిర్వహణకు ప్రయివేటు వారికి అప్పగించటం. పేరు ఏది పెట్టినా మన పాలకులు వాటిని పాడి గేదెలు లేదా ఆవులుగా మారుస్తామని చెబుతున్నారు. ఒకసారి మన గేదె, ఆవును ఇతరులకు అప్పగించి మేపి, పాలు తీసి అమ్ముకొని మీరు నాలుగు డబ్బులు వెనకేసుకొని మాకు నాలుగు రూకలు ఇమ్మని చెప్పిన తరువాత...వారు ఎంత ధర చెబితే అంతకు మనం కూడా పాలు కొనాల్సిందే. ధర మీద మనకు అజమాయిషీ వుండదు. ముసలిదైపోయి పాలిచ్చే అవకాశం లేని దశలో గేదెను మనకు అప్పగిస్తారు.
ప్రయివేటీకరణ విషయంలో కాంగ్రెస్‌, బిజెపి లకు వున్న మౌలికమైన తేడాలు ఏమిటన్నది కొందరికి సందేహం. సూటిగా చెప్పాలంటే ఆస్తులను సృష్టించిన ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించిన పార్టీ కాంగ్రెస్‌. వాటిని తెగనమ్మేందుకు పూనుకున్న పక్షం బిజెపి. మొదటి పక్షానికి కాస్త బెరుకు ఉండేది. రెండో పార్టీకి అలాంటి వేమీ లేవు. ఎందుకంటే వారి ఏలుబడిలో సృష్టించిన ఆస్తులేమీ లేవు కదా! కాకపోతే మిగతా అంశాల్లో ఎలా అయితే ముసుగులు వేసుకుందో ఈ విషయంలో కూడా అదే చేస్తోందన్నది పరిశీలకుల భావన. అదే పూర్తిగా కట్టబెట్టటం కాదు. నిర్వహించి ప్రభుత్వానికి కొంత ముట్టచెప్పటం అని చెబుతున్నది. దానికే మోనిటైజేషన్‌ అని పేరు పెట్టారు. ప్రయివేటు రంగం గురించి దేశ ప్రజలకు భ్రమలు, మరులు కొల్పించటం, ఆశ్రితులకు కారుచౌకగా ప్రజల ఆస్తులను కట్టబెట్టటం కొత్త కాదు. నయా ఉదారవాద విధానంలో అవి ఒక ప్రధాన అంశం.
ప్రయివేటు రంగం ఎంత అవినీతి, అక్రమాలతో జనాలను పీక్కు తింటుందో, ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందో కరోనా మహమ్మారి వెల్లడించింది. జెట్‌ ఎయిర్‌ వేస్‌, కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌, ఎస్‌ బ్యాంకు, ఐ.ఎల్‌ అండ్‌ ఎఫ్‌.ఎస్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, టాటా టెలి సర్వీసెస్‌, ఒడా ఫోన్‌, సత్యం కంప్యూటర్స్‌, ఇలా అనేక కంపెనీలు ఎలా మోసాలకు పాల్పడ్డాయో తెలిసిందే. ఇలాంటి వారికి ప్రభుత్వ ఆస్తులను అప్పగిస్తే వారు బాగుచేస్తారన్న హామీ ఏమిటి? రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ాఅనిల్‌ అంబానీ ఘోర వైఫల్యం గురించి తెలిసిందే. మన కళ్ల ముందు దివాలా తీసిన అతి పెద్ద ప్రయివేటు కంపెనీ. వారి సామర్ధ్యం ఏమైంది? పద్దెనిమిది వేల కోట్ల ఆస్తులున్న సదరు కంపెనీ 50 వేల కోట్ల అప్పులతో ఐ.పి (దివాలా పిటీషన్‌) పెట్టింది. దానికే రాఫెల్‌ విమానాల కాంట్రాక్టును కట్టపెట్టారు. పెద్ద మనిషిగా పేరు గాంచిన రతన్‌ టాటా గ్రూపుకు చెందిన టాటా సన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ వివాదం గురించి తెలిసిందే. సైరస్‌ మిస్త్రీ నియామకం, తొలగింపు, కోర్టు వివాదాలు. అసలు ఏం జరుగుతోంది, వారు దేని గురించి దెబ్బలాడుకుంటున్నారో జనానికి తెలుసా? పారదర్శకత ఉందా! వారి సమస్యలనే వారు పరిష్కరించుకోలేక బజారుకు ఎక్కిన వారు దేశాన్ని ఉద్ధరిస్తారంటే నమ్మటం ఎలా? వారు గాకపోతే మరొకరు. బండారం బయటకు రానంతవరకే పెద్దమనుషులు. తెర తొలిగితే విశ్వరూపం కనిపిస్తుంది. ఇలాంటి ప్రయివేటు సంస్థలకు ప్రజల ఆస్తులను అప్పగించబోతున్నారు.
ఇక ప్రయివేటు బ్యాంకులు తీరుతెన్నులను చూద్దాం. గతంలో బ్యాంకులను జాతీయీకరణ చేసినందుకు ఇందిరా గాంధీకి జనం బ్రహ్మరథం పట్టారంటే అమాయకులై కాదు. ప్రయివేటు రంగంలోని బ్యాంకులు, బీమా కంపెనీలు జనానికి టోపీ పెట్టాయి గనుకనే హర్షించారు. ఇప్పుడు జాతీయ సంపదలుగా ఉన్నవాటిని తిరిగి ప్రయివేటు రంగానికి కట్టబెట్టబోతున్నారు. 1947 నుంచి 1969 వరకు 559 ప్రయివేటు బ్యాంకులు దివాలా తీశాయి. ఈ కాలంలో 736 బ్యాంకులను విలీనం లేదా రద్దు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులను తిరిగి ప్రయివేటీకరించాలని కోరుతున్నారు. వాటిని ప్రయివేటు వారు కరి మింగిన వెలగపండులా మారిస్తే ప్రజల సొమ్ముకు ఎవరు బాధ్యత తీసుకుంటారు. 1969 బ్యాంకుల జాతీయీకరణ తరువాత కూడా కొన్ని ప్రయివేటు బ్యాంకులను అనుమతించారు. వాటిలో ఇప్పటి వరకు 36 బ్యాంకులు అక్రమాలకు పాల్పడ్డాయి. అవేవీ ఇప్పుడు ఉనికిలో లేవు. గ్ల్రోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకు వాటిలో ఒకటి. దానిని ఓరియంటల్‌ బ్యాంకుతో విలీనం చేశారు. ప్రయివేటు యాజమాన్యాలు అంత సమర్ధవంతమైనవి అయితే ఈ పరిస్ధితి ఎందుకు తలెత్తింది. ఇప్పుడున్న ప్రయివేటు బ్యాంకులు తమ వాటాను ఎందుకు పెంచుకోలేకపోతున్నాయి. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 563 ప్రయివేటు బ్యాంకులు విఫలమయ్యాయి. అక్కడ మొత్తం ప్రయివేటు రంగానిదే ఆధిపత్యం కదా!
'మోనిటైజేషన్‌ ప్రకటించే ముందు ఆస్ట్రేలియా అనుభవాన్ని పరిగణన లోకి తీసుకున్నారా?' అంటూ మీడియాలో వచ్చిన ఒక విశ్లేషణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు అలాంటి ప్రశ్నలు మన మీడియాలో వచ్చేదే అపురూపం. ఎందుకంటే మీడియా యాజమాన్యాలు ప్రయివేటీకరణకు అనుకూలం గనుక. మోనిటైజేషన్‌ అంటే ప్రయివేటీకరణ లేదా నిర్వహణకు ప్రయివేటు వారికి అప్పగించటం. పేరు ఏది పెట్టినా మన పాలకులు వాటిని పాడి గేదెలు లేదా ఆవులుగా మారుస్తామని చెబుతున్నారు. ఒకసారి మన గేదె, ఆవును ఇతరులకు అప్పగించి మేపి, పాలు తీసి అమ్ముకొని మీరు నాలుగు డబ్బులు వెనకేసుకొని మాకు నాలుగు రూకలు ఇమ్మని చెప్పిన తరువాత...వారు ఎంత ధర చెబితే అంతకు మనం కూడా పాలు కొనాల్సిందే. ధర మీద మనకు అజమాయిషీ వుండదు. ముసలిదైపోయి పాలిచ్చే అవకాశం లేని దశలో గేదెను మనకు అప్పగిస్తారు.
అందువలన అలాంటి పనులు చేయబోయే ముందు పోటీతత్వం ఉందో లేదో, వినియోగదారులను అధిక ధరలతో పిండకుండా చూసేందుకు ప్రభుత్వం బహిరంగ సమీక్షలు జరపాలని ఆస్ట్రేలియా పోటీతత్వ నిఘా సంస్థ అధ్యక్షుడు రోడ్‌ సిమ్స్‌ చెప్పారు. మరి తామే అసలైన జవాబుదారులం, చౌకీదారులం అని చెబుతున్న మోడీ సర్కార్‌ అలాంటి చర్చ ఎన్నడైనా, ఎక్కడైనా జరిపిందా? ఆస్ట్రేలియాలో తరచుగా పోటీ లేకుండా ప్రయివేటు వారికి అప్పగిస్తున్నారని సిమ్స్‌ వాపోయాడు. నియంత్రణలు లేకపోతే జనాన్ని పీక్కుతింటారని అన్నాడు. ఆస్తులను పాడి గేదెల మాదిరి మారిస్తే ఆర్థిక సామర్ధ్యానికి ప్రతిబంధకం అవుతుందన్నాడు. సింగపూర్‌లో రైల్వేలను కొంత మేరకు ప్రయివేటీకరించారు. తీసుకున్న యజమాని తగినంత పెట్టుబడి పెట్టని కారణంగా రైళ్లు ఆగిపోతున్నాయి. అందువలన తిరిగి జాతీయం చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది.
పలు కంపెనీలు టెలికాం రంగంలోకి వచ్చినపుడు పోటీ పడి చార్జీలు తగ్గించిన విషయం తెలిసిందే. ఆలశ్యంగా మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్‌ జియో వినియోగదారులను అతి తక్కువ ఛార్జీలతో ఆకర్షించింది. తన ఆర్థిక శక్తిని పెట్టుబడిగా పెట్టింది. గణనీయమైన మార్కెట్‌ను ఆక్రమించింది. పోటీ కంపెనీలు దివాలా దీసిన తరువాత చార్జీలు పెంచుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న ఒకటి రెండు కంపెనీలు కూడా రంగం నుంచి తప్పుకుంటే ముఖేష్‌ అంబానీ ఎంత చెబితే అంత చెల్లించక తప్పదు. రేపు రోడ్లయినా, విద్యుత్‌ మరొకటి ఏదైనా అంతే. మొత్తం ప్రయివేటు వారి నిర్వహణకు పోతే వారెంత చార్జీ చెల్లించాలంటే అంత చెల్లించాల్సిందే. పజల ఆస్తులను ప్రయివేటు వారికి కట్టబెట్టటం మన దేశంలోనే కాదు. అనేక దేశాల పాలకులు సమర్పించుకుంటున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న వాటి విలువ కనిష్టంగా 75 లక్షల కోట్ల డాలర్లని నాలుగు సంవత్సరాల నాటి ఒక అంచనా. రాష్ట్ర, స్ధానిక ప్రభుత్వాల వాటిని కూడా కలుపుకుంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వాల అప్పులు అనేక దేశాల్లో జిడిపి కి వంద శాతం దాటి నందున రాబోయే రోజుల్లో ఆర్థిక వృద్ధి మరియు ఉపాధి కల్పనకు నిధుల కేటాయింపు మరింత ఇబ్బంది అవుతుందని, అవసరాలకు-కేటాయింపులకు మధ్య తేడా 2040 నాటికి 15 లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. మన దేశంలో కూడా అదే జరుగుతోంది.
1998 నాటికి మన కేంద్ర ప్రభుత్వ రుణం దాదాపు పది లక్షల కోట్లు. అది 2014లో నరేంద్రమోడీ అధికారానికి వచ్చే నాటికి 53 లక్షల కోట్లకు పెరిగింది. 2021 మార్చి నాటికి ఆ మొత్తం 116 లక్షల కోట్లు. వర్తమాన ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అది 132 లక్షల కోట్లు అవుతుందని అంచనా. కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల రుణాల మొత్తం జిడిపి లో 2019-20 నాటికి 70 శాతం అయితే, మరుసటి ఏడాదికి అది 90 శాతానికి చేరింది. వంద శాతం మార్కు దాటటానికి ఎంతో దూరంలో లేము. అందువలన పాలకులు తెగబడి ప్రభుత్వ ఆస్తులను అయినకాడికి తెగనమ్మి లేదా నిర్వహణకు ప్రయివేటువారికి అప్పగించి సొమ్ము చేసుకొని లోటు పూడ్చుకొనేందుకు లేదా అప్పులు తీర్చేందుకు పూనుకున్నారు. ఇవన్నీ అయిపోయిన తరువాత జనం మీద మరిన్ని భారాలు మోపటమే తరువాయి. నిరుపయోగంగా పడి ఉన్న ఆస్తులను ధనార్జన అని నిర్మలమ్మ నమ్మబలుకుతున్నా అసలు విషయం వేరే.
2021 ఫిబ్రవరి 24 మన ప్రధాని నరేంద్ర మోడీ జాతికి ఒక సందేశం ఇచ్చారు. మోనిటైజ్‌ అండ్‌ మోడర్నయిజ్‌ (ధనార్జన మరియు నవీకరణ) అనే ఇతివృత్తంతో బడ్జెట్‌ను రూపొందించామని, ప్రభుత్వం ఉన్నది పాలన చేయటానికి తప్ప వాణిజ్యం చేయటానికి కాదు అన్నారు. కేంద్ర ప్రభుత్వశాఖ ''దీపం'' (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) ఏర్పాటు చేసిన ఒక వెబినార్‌లో మోడీ మాట్లాడారు. ప్రయివేటీకరణ మరియు ధనార్జన (మోనిటైజేషన్‌) ద్వారా వచ్చిన సొమ్మును ప్రజలకు వినియోగిస్తామన్నారు. అంటే వీలైన వాటిని తెగనమ్మేస్తారు. కాని వాటిని మోనిటైజేషన్‌ పేరుతో ప్రయివేటు వారికి సమర్పిస్తారు. చిత్రం ఏమిటంటే బ్రిటన్‌ కంపెనీ అయిన ఒడా ఐడియా కంపెనీ చేతులెత్తేసి 'మా వాటాలను అప్పగిస్తాం. మమ్మల్ని ఊబి నుంచి బయటపడేయండి' అని వేడుకోళ్లకు దిగింది. దాన్ని కొనుగోలు చేసేందుకు జియో ఇతరులు పోటీ పడుతున్నాయి. ఇంకా అనేక కంపెనీలు అదే స్ధితిలో ఉన్నాయి. ఇదే సమయంలో ఆస్తులతో ఆర్జన మాచేత కావటం లేదు వీటిని తీసుకొని మాకు నాలుగు రూకలిచ్చేవారు ఎవరైనా ఉన్నారా అంటూ మోడీ సర్కార్‌ వీధుల్లో నిలబడింది. ఏడు సంవత్సరాల క్రితం మీరు మా దేశానికి రండి. వస్తువులను తయారు చేయండి. ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోండి' అని విదేశీ కార్పొరేట్లు, వాణిజ్య సంస్ధలకు విజ్ఞప్తి చేసిన నరేంద్ర మోడీ...ఇప్పుడు అవే సంస్ధలకు 'మా ఆస్తులు తీసుకోండి. నిర్వహించండి. మాకు కొంత సొమ్ము ముట్ట చెప్పండి' అని వేడుకుంటున్నారు. ఎంతలో ఎంత మార్పు!

- ఎం. కోటేశ్వరరావు

ప్రైవేటీకరణ మరో రూపం