Apr 08,2023 00:23
పంగులూరులో శనగలను ఎండలో ఆరబెట్టిన రైతులు

ప్రజాశక్తి-పంగులూరు: నిన్న మొన్నటి వరకు శనగల కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు పెడతారా అని ఎదురుచూసిన శనగ రైతులు, ఇప్పుడు ఆ మాట మరిచిపోయి, ప్రైవేట్‌ వ్యాపారుల కోసం ఎదురుచూస్తున్నారు. బయట మార్కెట్‌ ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటంతో, ప్రైవేట్‌ వ్యాపారులకు శనగలను అమ్ముకునేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ధర క్వింటా 5,335 రూపాయలు ఉండగా, ప్రైవేట్‌ ధర గత పది రోజుల క్రితం రూ.4,700 నుంచి రోజురోజుకూ పెరుగుతూ, ప్రస్తుతం రూ.5,200 వరకు చేరటంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారుల వైపు చూస్తున్నారు. ప్రస్తుతం జేజే-11 రకం శనగలు క్వింటా రూ.5,200, కాక్‌-2 రకం శనగలు క్వింటా రూ.8,200 ధరలు పలుకుతున్నాయి. సుమారు 12 రోజుల క్రితం పంగులూరు మండలంలో పంగులూరు, చందలూరు గ్రామాల్లో శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అయితే కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించడమే తప్ప, ఇంతవరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. పైగా రైతులు ఈ-క్రాప్‌ చేయించుకోవాలని, తరువాత వ్యవసాయ శాఖ అధికారులు దగ్గర రిజిస్టర్‌ చేయించుకుని, అమ్ముకునే తేదీని ప్రకటించిన తరువాత సరుకు తీసుకురావాలని, తేమశాతం, మట్టి, మొదలైన పరీక్షల అనంతరం వాళ్లు కొంటారు. పైగా కొనుగోలు కేంద్రం వరకు రైతులే తమ శనగలను తీసుకు రావాలి, వాటిని ఆరబెట్టుకోవాలి, వానకు, మంచుకు తడవ కుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కూలీల చేత రైతు ఖర్చుతోనే జల్లెడ వేయించి, బస్తాలకు ఎక్కించి, లారీకి లోడ్‌ చేయాలి. ఈ ఖర్చులన్నీ రైతులే భరించాలి. సరుకును తరలించిన తర్వాత, తేడా వస్తే మరలా సరుకును తెచ్చుకు నేందుకు రవాణా ఖర్చులు కూడా రైతే భరించాల్సి వస్తుంది. ఇవి అన్ని భరించే కన్నా, ఏ ఇబ్బంది లేకుండా ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవటం మేలని రైతులు భావిస్తున్నారు. పైగా ప్రస్తుతం క్వింటా రూ.5,200 రూపాయల ధర పలకటం, మరి కొద్ది రోజుల్లో క్వింటా 6,000 రూపాయల వరకు ధర పలికే అవకాశం ఉందని ప్రచారం జరగటంతో, రైతులు ప్రైవేట్‌ వ్యాపారులు వైపే మొగ్గుచూపుతున్నారు. ఇందుకోసం కొద్ది రోజులపాటు తమ సరుకును కోల్డ్‌ స్టోరేజీలకు తరలించే ప్రయత్నాలు కూడా కొంతమంది రైతులు చేస్తున్నారు. పంగులూరు మండలంలో ఈ సంవత్సరం 4,700 ఎకరాల్లో శనగ పంటను రైతులు సాగు చేశారు. ఎకరాకు కనీసం 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. సుమారు 470 టన్నుల శనగలు ఈ మండలం నుంచి మార్కెట్‌కు వెళ్లే అవకాశం ఉంది. అందువలన రైతులు ప్రైవేట్‌ వ్యాపారులు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నారు. వ్యాపారులు కూడా ముందుగానే సరుకులు కొనేందుకు రైతుల వద్దకు వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనలు, ఆలస్యంగా కొనుగోలు చేయడం వలన, ఈ సంవత్సరం శనగలు ప్రైవేటు వ్యాపారుల పరం అయ్యేటట్లు కనిపిస్తోంది.