Mar 11,2023 01:27
పంగులూరు మార్కెట్‌ యార్డ్‌లో మొక్కజొన్నను ఆరబెట్టి, బస్తాలకు ఎత్తుతున్న దృశ్యం

ప్రజాశక్తి-పంగులూరు: మొక్కజొన్న ఇప్పుడిప్పుడే పండి రైతు ఇంటికి చేరుతోంది. రైతులు మొక్కజొన్నను అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రైవేట్‌ వ్యాపారులు ధరను పెంచుతూ ఉండటంతో రైతులు కొంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గతంలో మొక్కజొన్నకు ఎప్పుడూ లేనంతగా ఇపుడు డిమాండ్‌ ఉంది. గతంలో మొక్కజొన్నను వ్యాపారులు అంతగా పట్టించుకునేవారు కాదు. గత సంవత్సరం రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో మొక్కజొన్న దిగుమతులు ఆగిపోవడంతో, ఇక్కడ మొక్కజొన్నకు డిమాండ్‌ పెరిగింది. దీంతో వ్యాపారులు మొక్కజొన్నకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పంగులూరు మండలంలో 4,700 ఎకరాల్లో ఈ సంవత్సరం రైతులు మొక్కజొన్నను సాగు చేశారు. వాతావరణం అనుకూలించటం వలన ప్రస్తుతం మొక్కజొన్న పంట ఆశాజనకంగానే ఉంది. ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రభుత్వం క్వింటా ధర రూ.1,950గా ప్రకటించగా, ప్రైవేటు వ్యాపారాలు మాత్రం నిన్న మొన్నటి వరకు రూ.2,150 ధర చెప్పినవారు ఈరోజు ఏకంగా రూ.2,300 ధర చెబుతున్నారు. దీంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారుల వైపు చూస్తున్నారు. కొంతమంది రైతులు ఈపాటికే మొక్కజొన్నను స్థానిక మార్కెట్‌ యార్డుకు తీసుకువచ్చి ఆరబెట్టుకుని వ్యాపారుల కోసం ఎదురు చూస్తున్నారు. మరికొందరు ఇంకా రేటు ఎంత పెరుగుతుందోనని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ రేటు కన్నా ప్రైవేట్‌ రేటు ఎక్కువగా ఉండటంతో ఈ రేటు ఎంత కాలం ఉంటుందో, ఎంత కొంటారో అని రైతులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఈ రేటు ఇవ్వాలని కోరుతున్నారు.