
సి.ఐ. శ్రీనివాసరావు ఉదయాన్నే స్టేషన్‌కు చేరుకునేసరికి, స్టేషన్ బయట ఒక అరడజను మంది ఆడపిల్లలు ముఖాలకు చున్నీలు కప్పుకొని, సిగ్గుతో తలవంచుకొని బల్లమీద కూర్చుని ఉన్నారు.
ఇంతలో ఎదురొచ్చిన ఏఎస్‌ఐ అశోక్ వంక చూస్తూ విషయం ఏమిటన్నట్టు తలాడించాడు శ్రీనివాసరావు.
'రాత్రి సంక్రాంతి సంబరాల్లో, రికార్డింగ్ డ్యాన్స్ చేస్తూ వీళ్లు పట్టుబడ్డారు సార్' బల్ల మీద కూర్చున్న ఆడపిల్లల వంక చూస్తూ జవాబిచ్చాడు అశోక్.
'మరి రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటుచేసిన బడాబాబులను అరెస్టు చేశారా?' ప్రశ్నించాడు సీఐ.
జవాబు ఏం చెప్పాలో తెలీక మౌనాన్ని ఆశ్రయించాడు అశోక్.
'పోనీ కనీసం వీళ్లు డ్యాన్స్ చేస్తుంటే, వీళ్లతో పాటు ఒళ్లు మరిచి డ్యాన్సులు చేసిన మగమహారాజులనన్నా అరెస్టు చేశారా?' అశోక్ మౌనంలోని అర్థం తెలిసిన వాడిలా ఇంకో ప్రశ్న సంధించాడు శ్రీనివాసరావు.
'అక్కడ చాలామంది గుమిగూడారు సార్! ఎవరినని అరెస్టు చేస్తాం?' అంటూ అశోక్ సమాధానం ఇచ్చే లోపే..
'అందుకని అమాయకులైన ఈ ఆడపిల్లలని మాత్రం పట్టుకొచ్చి, స్టేషన్‌లో పడేశారు అంతేనా?' అశోక్ అసమర్థతని ఎత్తి చూపాడు శ్రీనివాసరావు.
'పోనీ, అక్కడే కోడిపందాలు ఆడుతూ చాలామంది ప్రబుద్ధులు మీకు కనపడి ఉంటారు కదా? వాళ్లని అరెస్టు చేయలేదే?' ఇంకో ప్రశ్న వేశాడు శ్రీనివాసరావు.
'కోడి పందాలు అన్నీ, ఎమ్మెల్యేగారి మనుషులే నిర్వహిస్తున్నారు సార్!' అశోక్కి మద్దతుగా అప్పుడే బయటకు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ బషీర్ సమాధానమిచ్చాడు.
'ఓ రాత్రి రైడింగ్లో మీరూ ఉన్నారన్నమాట. పోనీ కోడిపందాల దగ్గరే, గుండాటలు, మూడు ముక్కలాటలు నిర్వహించే రౌడీ వెధవలనన్నా తీసుకురాలేకపోయారా? కాస్తన్నా మీ డ్యూటీకి న్యాయం చేసినవాళ్లు అయ్యేవాళ్లు' అన్నాడు శ్రీనివాసరావు.
సమాధానం ఏం చెప్పాలో తెలీక బషీర్ నేలచూపులు చూశాడు. 'మమ్మల్ని చూసి వాళ్లంతా పారిపోయారు సార్!' అంటూ అశోక్ జవాబిచ్చాడు.
'పారిపోయారా? మామూళ్లు తీసుకుని వదిలేశారా?' శ్రీనివాసరావు గొంతులో వెటకారం తొంగిచూసింది.
'సార్ మీరు మరీ మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు సార్?' నొచ్చుకున్నాడు రిటైర్మెంట్ దగ్గరపడిన హెడ్ కానిస్టేబుల్ బషీర్.
'లేకపోతే ఏమిటండీ బషీర్‌గారు మిమ్మల్ని అసలు రైడింగ్‌కి ఎవరు వెళ్లమన్నారు? అశోక్ అంటే ఉద్యోగానికి కొత్త. ఇంత వయసు, అనుభవం ఉన్న మీరూ సంక్రాంతి జాతరలప్పుడు రైడింగుకు వెళ్లి ఏమి సాధిద్దాం అనుకున్నారు. పోనీ వెళ్లిన వాళ్లు డ్యూటీ సరిగ్గా చేశారా..? అంటే అదీ లేదు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు, అమాయకులైన నలుగురు అమ్మాయిలను మాత్రం వెంటేసుకొచ్చారు' అంటూ విసుక్కున్నాడు సిఐ శ్రీనివాసరావు.
'అదేమిటి సార్? మేమేం తప్పు చేశాం? డబ్బులు పెట్టి కోడిపందాలు ఆడటం జూదంతో సమానం కాదా? అందుకనే రైడింగ్‌కి వెళ్లాం' తానేమీ తప్పు చేయలేదు అన్నట్లు ఆవేశంగా అడిగాడు బషీర్.
'బషీర్ గారు, కోడి పందాలు ఆడటం జూదం అని ఎవరన్నారు? సాక్షాత్తు న్యాయస్థానమే కోడిపందాలు మన సంస్కృతి, సాంప్రదాయాల్లో ఒక భాగమని, వాటిని అడ్డుకోవటం మన సంస్కృతిని మనమే కించపరుచు కోవడం అని సెలవిచ్చాయి. ప్రభుత్వాలే దగ్గరుండి ఈ ఆటలు ఆడిస్తుంటే ఇక మనమెవరం చెప్పండి వాటిని ఆపడానికి?' అంటూ చట్టాల్లోని లొసుగులు కోడిపందాలు వంటి జూదాలను ఏవిధంగా అరికట్టలేకపోతున్నాయో ఎత్తి చూపాడు శ్రీనివాసరావు.
'నిజమే సార్, కోర్టు అనుమతి ఇచ్చింది కదా! అని లక్షలకు లక్షలు పందాలు కాస్తూ, మూగజీవాలను కత్తులకు బలి చేయడం న్యాయమా చెప్పండి?' ఆవేశంగా అడిగాడు అశోక్.
'నిజంగానే న్యాయం కాదు. మరి మనం ఏం చేయగలిగాం చెప్పు అశోక్. ఒకవేళ నువ్వు నిజంగానే వాళ్లను పట్టుకుందాం అని వెళ్లినా, వాళ్లకు రాజకీయ నాయకుల మద్దతు ఉండనే ఉంది. పట్టుకున్న 10 నిమిషాల్లో ఏ ఎమ్మెల్యేనో, మినిస్టరో వచ్చి, వారిని విడిపించుకుపోతారు. ఎందుకంటే ఆ జూదపు సొమ్ములో వాళ్లకీ వాటా ఉంటుంది. చివరికి సర్కస్‌లో బఫూన్లలాగా, ఇదిగో ఇలాంటి అమాయకులైన అమ్మాయిలను అరెస్టు చేసి, ముఖాలు వేలాడేసుకుని రావడం తప్ప మనం చేయగలిగింది ఏముంటుంది?' అంటూ హితోపదేశం చేశాడు శ్రీనివాసరావు.
'అంటే అశ్లీల నృత్యాలు చేసే ఈ ఆడపిల్లలు తప్పేం చేయలేదంటారా? వీళ్లని చూస్తూ ఉంటే ఆడవాళ్ల మీద ఉన్న గౌరవం కూడా పోతోంది' మళ్లీ రెట్టించాడు అశోక్ తానేదో ఘనకార్యం చేసినట్లు.
అశోక్ మాటలు తూటాల్లా ఆడపిల్లల గుండెల్లో ఎక్కడో తగలడంతో, ఒక్కసారి అందరూ చివ్వుమని తలెత్తి అశోక్ వంక సూటిగా చూశారు. ఆ చూపులకు గనుక శక్తే ఉంటే, ఈపాటికి అశోక్ మాడి మసైపోయేవాడు.
ఆడపిల్లల మనోభావాలు అర్థమైనవాడిలా, 'వీళ్లు తప్పు చేశారా? తప్పు చేయలేదా? అని మనం తర్వాత ఆలోచిద్దాం. మొన్నీ మధ్యన మన ఏరియాలోని ఒక పబ్ మీద రైడింగ్ చేశాము నీకు గుర్తుందా అశోక్?' అంటూ అశోక్‌ని గతంలోకి తీసుకెళ్లాడు శ్రీనివాసరావు.
***
ఊరి నడిబొడ్డులో నిర్వహిస్తున్న పబ్ మీద తన సిబ్బందితో రైడింగ్ చేశాడు సిఐ శ్రీనివాసరావు. ఆ పబ్‌కు వచ్చి పోయే మందుబాబుల వల్ల ఇబ్బందులకు గురవుతున్న చుట్టుపక్కల నివసిస్తున్న కుటుంబాలు అన్నీ కలిసి కంప్లైంట్ ఇవ్వటంతో, రైడింగ్ చేయక తప్పలేదు. శ్రీనివాసరావుకి.
చీకటి వెలుగుల మాటున, అర్ధ నగ శరీరాలతో, మాదకద్రవ్యాల మత్తులో ఊగిపోతున్నారు నూనూగు మీసాలు కూడా రాని యువతీ యువకులు. అక్కడున్న ఆడపిల్లల పరిస్థితిని చూసి పోలీసులే సిగ్గుతో తలవంచుకున్నారు గాని, వాళ్లకు మాత్రం ఏమీ పట్టనట్లు కనపడలేదు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డ వాళ్లు, తమ శరీరాలను తాకట్టు పెట్టి జీవితాలను బలి పెట్టుకుంటున్నారని వాళ్లకు అర్థం కావట్లేదు.
పోలీసులను చూసి కూడా తమకేమీ పట్టనట్టు చిందులేస్తుంటే, లాఠీలకు పనిచెప్పక తప్పలేదు శ్రీనివాసరావు బృందానికి.
ఏ ఎస్సైఅశోక్, హెడ్‌కానిస్టేబుల్ బషీర్, మరో నలుగురు కానిస్టేబుళ్లు కలిసి, పబ్బు బయట, రోడ్డు మీద అందరినీ మోకాళ్ల మీద నిలబెట్టారు. ఒక్కరు కూడా సరిగ్గా నిలబడటానికి ఓపిక లేక తలలువంచి ఊగుతున్నారు శవాల్లా.
వాళ్ల దగ్గర నిషేధింపబడిన గంజాయి, హేరాయిన్, చరస్ వంటి మత్తు పదార్థాలు దొరకడం చూసి ఆశ్చర్యపోవటం పోలీసుల వంతయ్యింది. వాళ్లందరి వివరాలూ సేకరించమని శ్రీనివాసరావు ఆదేశించడంతో, ఆ పనిలో నిమగమయ్యాడు ఏఎస్సై అశోక్.
వాళ్లలో చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, బడా వ్యాపారవేత్తలు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏయస్ ఆఫీసర్ల బిడ్డలూ ఉన్నారు. వాళ్లందరికీ డబ్బు మదం తలకెక్కి, పెడదారులు పడుతున్నారని గ్రహించాడు అశోక్.
వాళ్లందరి వివరాలూ పూర్తిగా సేకరించకముందే, సిఐ శ్రీనివాసరావుకు ఎక్కడి నుంచో ఒక ఫోన్‌కాల్ వచ్చింది.
బహుశా శ్రీనివాసరావు పైఅధికారి కామోసు, తన అనుమతి లేకుండా పబ్బు మీద రైడింగ్ చేసినందుకు శ్రీనివాసరావుకు చీవాట్లు పెడుతున్నాడు. శ్రీనివాసరావు ఎంత నచ్చజెప్పాలని ప్రయత్నించినా, పై అధికారి మాట వినకపోవడంతో, చేసేదేమీలేక మౌనంగా నడుచుకుంటూ వెళ్లి జీపులో కూలబడ్డాడు.
పరిస్థితి అర్థమైన వాళ్లలా, అశోక్, బషీర్, మిగతా కానిస్టేబుళ్లు కూడా శ్రీనివాసరావును అనుసరించారు.
దారి మధ్యలో అశోకే కాస్త చొరవ తీసుకుని 'ఏంటి సార్ అలా వచ్చేశారు, మధ్యలో వదిలేసి?' అంటూ ప్రశ్నించాడు .
అసలు విషయం తెలిసిన వాడిలా బషీర్, 'ఏముంది సార్ డిఎస్పీ గారి నుంచే ఫోన్ అయ్యుంటుంది? ఆయనెప్పుడూ అంతేకదా సార్, వట్టి డబ్బు మనిషి. ఈపాటికి పబ్ వాళ్ల దగ్గర ఎంతోకొంత నొక్కేసే ఉంటాడు' అంటూ అశోక్ అనుమానాన్ని నివృత్తి చేశాడు.
అశోక్ లాంటి కొత్తగా వచ్చిన వాళ్లకిది వింతేమోగానీ, శ్రీనివాసరావులాంటి తల పండిన పోలీస్ ఆఫీసరుకి ఇవన్నీ మామూలే. అందుకనే జరిగిన సంఘటనకి శ్రీనివాసరావు పెద్దగా ఏమి బాధ పడలేదు.
***
గతం గుర్తుకొచ్చినవాడిలా 'అవును సార్! ఆ రోజు కనుక, మనకు పైనుంచి వత్తిడి రాకపోతే ఆ మత్తు పిశాచాలను వదిలేవాళ్లం కాదు' అన్నాడు కసిగా అశోక్.
'డబ్బు మదంతో కొట్టుకుంటూ, కన్నూ మిన్నూ కానకుండా, మాదకద్రవ్యాలకు అలవాటుపడి, అర్ధనగ నృత్యాలు చేస్తూ సమాజానికి చీడపురుగులుగా తయారవుతున్న వాళ్లను మాత్రం మనం వదిలేశాం. ఆకలికి తట్టుకోలేక, కుటుంబాన్ని పోషించుకోవడానికి తమ శరీరాలను పెట్టుబడిగా పెడుతున్న, అభం శుభం తెలియని ఈ ఆడపిల్లలను మాత్రం మనం నేరస్తులుగా, రేపు కోర్టు ముందు హాజరు పెట్టబోతున్నాము. అంతేనా?' అంటూ శ్రీనివాసరావు అశోక్ వంక చూస్తూ ప్రశ్నించాడు.
'మీరన్నది నిజమే కావచ్చు సార్!.. కానీ ?' ఇంకా అనుమానం తీరని వాడిలా మధ్యలోనే తన మాటలు మింగేశాడు అశోక్.
'ఏమిటి ఇంకా కానీలు, అర్ధనాలు, పావలాలు అశోక్? నీకు ఇంత చెబుతున్నా అర్థం కావట్లేదు. సమాజంలో అధికార మదంతో, డబ్బు మదంతో నేరాలు చేసే వాళ్లందరూ చట్టాలలోని లొసుగులను ఆధారంగా చేసుకుని పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్లందరూ పుణ్యాత్ములా. డబ్బు మదంతో, తిన్నది అరగక ఆడపిల్లలమని కూడా ఆలోచించకుండా, బరితెగించి మద్యం మత్తులో మాదక ద్రవ్యాలకు బానిసలై అర్ధ నగ నృత్యాలు చేసే వాళ్లందరూ పవిత్రులా. చివరకు కూటికి గతిలేక, ఏ దారీ తెన్నూ తెలియక, తమ కుటుంబాలను పోషించుకోవడానికి పైట జారిస్తే వీళ్లు పతితులా' అంటూ శ్రీనివాసరావు తన మాటలు ముగించే లోపే.. శ్రీనివాసరావు ఆంతర్యం తెలిసినవాడిలా అశోక్, అక్కడున్న ఆరుగురు ఆడపిల్లల్ని వదిలివేయమన్నట్లు బషీర్‌కు సైగ చేశాడు.
ఆ ఆరుగురు ఆడపిల్లలు వెళుతూ వెళ్తూ శ్రీనివాసరావు కాళ్లకు దండం పెట్టపోయారు కన్నీళ్లతో.
వాళ్లను భుజాలు పట్టుకుని పైకి లేపుతూ, 'చూడండమ్మా మీరందరూ చదువుకున్న ఆడపిల్లల్లాగా కనబడుతున్నారు. మా పోలీసుల్లో అశోక్‌లాగా అందరూ మంచి పోలీసులు ఉంటారని అనుకోవద్దు. ప్రతి మనిషికీ ఆకలి, అవసరాలు ఉంటూనే ఉంటాయి. వాటిని తీర్చుకోవటానికి మాత్రం ఇది దారి కాదు. మీ కన్నా పేదరికంలో బతికే ఎంతోమంది కూలీనాలీ చేసుకుని తమ కడుపులు నింపుకుంటున్నారు. వాళ్లు మీలాగా తమ ఆడతనాన్ని అమ్ముకోవటం లేదు. ఇక నుంచి అయినా సరైన దారిలో నడుస్తారని ఆశిస్తున్నాను. మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే అవకాశం రాకూడదని కోరుకుంటున్నా' అంటూ వాళ్లకు వీడ్కోలు పలికాడు శ్రీనివాసరావు.
వాళ్లు వెళ్తున్న వైపే, ఏదో తప్పు చేసినవాడిలా అశోక్ చూస్తూ నిలబడిపోయాడు.
***
'సార్ అశోక్ గారి పెళ్లికి మీరు రావట్లేదా?' బషీర్ అడిగిన ప్రశ్నకు ఫైళ్లు ముందేసుకుని. వాటిలో పూర్తిగా నిమగమైపోయిన శ్రీనివాసరావు తలెత్తి పైకి చూస్తూ..
'అవును కదా? నేను మర్చేపోయాను పనిలోపడి, ఎన్ని గంటలకు పెళ్లి' అంటూ చూస్తున్న ఫైలు మూసేసి, పైకి లేచి నిలబడ్డాడు శ్రీనివాసరావు.
'పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో కదా సార్? మిమ్మల్ని సాక్షి సంతకం కూడా పెట్టడానికి రమ్మన్నారు అశోక్‌గారు .అప్పుడే మర్చిపోయినట్లున్నారు' గుర్తుచేశాడు బషీర్.
'అవును బషీర్ గుర్తొచ్చింది. మరీ మరీ రమ్మని పిలిచాడు అశోక్. వయసు మీద పడుతోంది కదా అన్నీ మర్చిపోతున్నాను' అంటూ స్టేషన్ బయటకు నడిచాడు జీపు ఎక్కటానికి.
శ్రీనివాసరావు రిజిస్టర్ ఆఫీసుకి చేరుకునేసరికి, అప్పటికే వధూవరులిద్దరూ దండలు మార్చుకుంటున్నారు.
శ్రీనివాసరావుని చూడగానే అశోక్, 'రండి సార్ లోపలికి రండి, మా సి.ఐ. సార్!' అంటూ పెళ్లికూతురికి, శ్రీనివాసరావుని పరిచయం చేశాడు.
తనకు నమస్కారం చేస్తున్న పెళ్లికూతురి వంక చూస్తూ, ఏదో గుర్తొచ్చినవాడిలా ఆలోచనలోపడ్డాడు శ్రీనివాసరావు.
'ఇక్కడ సంతకం పెట్టండి' అంటూ రిజిస్టర్ ఆఫీసు క్లర్కు పిలవటంతో.. మళ్లీ ఈ లోకంలోకి వచ్చిన శ్రీనివాసరావు రిజిస్టర్లో సాక్షి సంతకం చేసి బయటకొస్తూ..
'అశోక్, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది' అంటూ తన అనుమానాన్ని బయటపెట్టాడు.
'మీకు ఇంకా గుర్తుకురాలేదా సార్? ఆ రోజు సంక్రాంతి సంబరాల్లో, రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నారని నేను అరెస్టు చేసి తీసుకువచ్చాను. వాళ్లలో ఈ అమ్మాయి కూడా ఒకరు' అంటూ గుర్తుచేశాడు అశోక్.
'అది సరే మరి ఈ పెళ్లి?' అంటూ నసుగుతూ, అనుమానం తీరనివాడిలా అయోమయంగా ముఖం పెట్టి అశోక వంక చూస్తుండిపోయాడు శ్రీనివాసరావు.
'ఆరోజు వీళ్లని మనం వదిలేసిన తర్వాత, మిగతా ఐదుగురూ వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ అమ్మాయి మాత్రం అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అదృష్టవశాత్తు నేను కూడా అటే వెళ్లడంతో రక్షించగలిగాను. ఆరా తీస్తే రికార్డింగ్ డ్యాన్సులకు వెళ్లడం అదే మొదటిసారి అట. కుటుంబాన్ని పోషించుకోవడానికి వేరే గత్యంతరం లేక ఆ పని చేసిందట. పైపెచ్చు మనం పోలీస్‌స్టేషనుకు తీసుకురావడంతో అవమానంతో ఇంట్లో వాళ్లకు ముఖం చూపించలేక ఆ పని చేసింది' జరిగింది చెప్పుకొచ్చాడు అశోక్.
'అందుకని నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావ్ అన్నమాట. ఏదైతేనేం, ఒక ఆడపిల్లకు జీవితాన్ని ఇచ్చావు. నిజంగా మన పోలీసుల్లో నీలాంటి వ్యక్తిత్వం గల వాళ్లు ఉండటం మన డిపార్ట్‌మెంటుకే గర్వకారణం' అంటూ శ్రీనివాసరావు, అశోక్ వంక చూస్తూ సెల్యూట్ చేశాడు.
ఈదర శ్రీనివాసరెడ్డి
78931 11985