సెర్ఫ్ సిఇఒలకు నాడు-నేడు బాధ్యతలు - ఇప్పటికే సచివాలయ సిబ్బందికి పలు పనుల పర్యవేక్షణ
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ప్రభుత్వ పాఠశాలలపై ఇతర శాఖల పెత్తనం మొదలైందా? కనీస అవగాహన లేని ఇతర శాఖల అధికారులకు విద్యాసంస్థల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నారా? అంటే తాజా ఉదాహరణలు అవుననే చెబుతున్నాయి. దీనికి తాజాగా నాడు-నేడు పనుల బాధ్యతలను సెర్ఫ్ ఎపిఎంలకు అప్పగించడమే నిదర్శనంగా నిలుస్తోందని విద్యాశాఖలో పలువురు చెబుతున్నారు.
ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు శాతం, మధ్యాహ్న భోజనం, పాఠశాలల్లో వసతులు వంటి పనులను ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించగా, తాజాగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్)కు నాడు - నేడు పథకం పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమ శాఖపై ఇతర శాఖల పెత్తనం మొదలుకావడంతో విద్యాశాఖ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల్లో అమలయ్యే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఉప విద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారులు పర్వవేక్షిస్తుంటారు. వీరికి సహాయకులుగా పాఠశాల సముదాయాల స్థాయిలో క్లస్టర్ రీసోర్స్‌పర్సన్లు పనిచేస్తున్నారు. అయితే వీరి పనితీరు సరిగా లేదంటూ పలు ఆరోపణలు రావడంతో పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం, పాఠశాలల్లో వసతులు తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఇటీవల గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందికి అధికారాలు ఇచ్చింది. దీనిపై విద్యాశాఖలో ఆసంతృప్తి వ్యక్తమవుతున్న తరుణంలోనే ఇటీవల సెర్ఫ్ మండల స్థాయి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ల (ఎపిఎం)కు 'నాడు-నేడు' పనులతోపాటుగా అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాలపై పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించి విధి విధానాలను ప్రకటించారు.
ఈ బాధ్యతలపై సెర్ఫ్ ఎపిఎంలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరమే వారి సేవలను వినియోగించుకోనున్నారు. దీంతోపాటుగా ప్రతీ మండలానికి ఇద్దరు ఎంఇఒలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వూలను కూడా విడుదల చేసింది. ఈ ఇద్దరు ఎంఇఒల్లో ఒకరిని ఉపాధ్యాయుల వేతనాలకు, పరిపాలనా వ్యవహారాలను చూడడానికి నియమించగా, మరో ఎంఇఒను బోధన సంబంధమైన (అకడమిక్) కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఎంఇఒలు వ్యతి రేకించడంతోపాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం విచారించి ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంఇఒలను కేవలం అకాడమిక్ కార్యక్రమాల పర్యవేక్షణకే పరిమితం చేసి, ఇతర బాధ్యతలను ఎపిఎంలకు అప్పగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయంతో విద్యాశాఖలో సైతం అసహనం వ్యక్తమవుతోంది. ఏ శాఖకు సంబంధించిన పనుల పర్యవేక్షణ ఆ శాఖ వారికే అర్థమవుతుందని, అలా కాకుండా వేరే శాఖకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే వాదనలూ వినిపిస్తున్నాయి.










