Sep 17,2023 21:07

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నాగార్జున

ప్రజాశక్తి-విజయనగరంకోట : నిరంకుశ చర్యల ద్వారా ప్రాథమిక హక్కులకు వైసిపి ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందని వక్తలు తెలిపారు. రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. స్థానిక అమర్‌భవన్‌లో ఆదివారం సిపిఐ ఆధ్వర్యాన రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున మాట్లాడుతూ గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన సిఎం జగన్‌.. తన దృష్టి అభివృద్ధిపై చూపిస్తే ప్రజలు సంతోషించే వారన్నారు. నాలుగున్నర ఏళ్ల పాలనలో రహదారులు వేశారా? కాలువలు కట్టించారా? మౌలిక సదుపాయాలు కల్పించారా? అని ప్రశ్నించారు. ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా క్షీణించాయని చెప్పారు. ధరలు విపరీతంగా పెరిగాయని, పరిశ్రమలు మూతపడుతున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కాక.. కక్ష సాధింపు పాలన మీదే జగన్‌ దృష్టిసారిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చివేసి ఆయన సాధించింది ఏమిటని ప్రశ్నించారు. సామాన్యులను సైతం ఇబ్బందులు పెడుతున్నారని గుర్తు చేశారు.
అనంతరం సిపిఐ రాష్ట్ర నాయకులు పి.కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతల పట్ల, ప్రజా ఉద్యమాల పట్ల జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఖండించారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం హిట్లర్‌ పరిపాలన కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతులను ఏదో ఒక విధంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించడం దారుణమన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని ప్రజలందరికీ అర్థమైందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు వస్తూ పోతూ ఉంటారని, అధికారం శాశ్వతం కాదని హితవుపలికారు. చంద్రబాబు అరెస్టు విషయంలోనూ చట్టబద్ధంగా వ్యవహరించలేదని తప్పుబట్టారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కరీమ్‌, ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు దయానంద్‌, జనసేన పార్టీ నాయకులు రాజు, తదితరులు మాట్లాడారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు రంగరాజు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అలమండ ఆనందరావు, పలు సంఘాల నాయకులు బి.పావని, బి.రమణమ్మ, బి.వాసు, కె.అప్పన్న, గోక రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.