Dec 24,2022 00:10

బ కెజిబివిలో మేథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జక్ట్‌లకు లేని అధ్యాపకులు
బ అయోమయంలో ఇంటర్‌ విద్యార్థినులు
ప్రజాశక్తి - ఎటపాక

ఎటపాక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కెజిబివి) జూనియర్‌ కళాశాలలో మేథ్స్‌, ఫిజిక్స్‌ అధ్యాపకులు లేకపోవడంతో నేటికీ ఈ సబ్జెక్టుల పాఠాలు మొదలుకాలేదు. దీంతో ఇంటర్‌ విద్యార్థినులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఎటపాక కెజిబివి స్కూల్‌కు అదనంగా జూనియర్‌ కాలేజీను మూడు సంవత్సరాల క్రితం మంజూరు చేసి ఎంపిసి గ్రూపును ప్రారంభించారు. ప్రస్తుతం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం 29 మంది, ద్వితీయ సంవత్సరం 37 మంది విద్యార్ధినులు ఉన్నారు. జూనియర్‌ కాలేజీ ప్రారంభమైన తరువాత కాంట్రాక్టు ప్రాతిపదికన అధ్యాపకుల నియామకం జరగ్గా, మరికొంత మందిని అవసరం మేరకు స్థానికంగా నియామకం చేసి బోధనకు ఇబ్బంది లేకుండా చూశారు. అయితే ఈ ఏడాది జిల్లాల విభజన తరువాత కెజిబివిలను ఎస్‌ఎస్‌ఎ పిఒల పరిధి నుంచి డిఇఒ పరిధిలోకి ప్రభుత్వం మార్చింది. అంతేకాకుండా స్థానికంగా నియమించుకునే అవకాశం కూడా లేకుండా చేసింది. ఈ జూనియర్‌ కళాశాలలో ఈ ఏడాది మేథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులకు అధ్యాపకులు లేరు. డిఇఒ ద్వారా ఈ రెండు సబ్జెక్టులకు అధ్యాపకుల నియామక ప్రక్రియ కూడా జరగలేదు.
విద్యా సంవత్సరం ప్రారంభమై 6 నెలలు గడుస్తుంది. సంక్రాంతి సెలవులు మినహయిస్తే ఇక రెండు నెలలు మాత్రమే ఉంటుంది. అలాంటిది నేటికీ అధ్యాపకులను నియమించే దిశగా ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థినులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్ధినుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పబ్లిక్‌ పరీక్షలకు చదువుతూనే, పలు రకాల ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్‌ కావాల్సి ఉంది. ఇంజనీరింగ్‌లో సీట్‌ సాధించాలన్నా, ఇంటర్‌లో మెరుగైన స్కోర్‌ పొందాలన్నా మేథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జక్ట్‌లు చాలా కీలకం. ఇవి నూటికి నూరు శాతం మార్కులు సాధించుకోగలిగే సబ్జెక్టులు. అటువంటి మేథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జక్ట్‌లకు అధ్యాపకులు లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక విద్యార్ధినులు అయోమయంలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఇంటర్‌ పాస్‌ అవుతామో లేదో అనే బెంగ వీరిని పట్టుకుంది. కళాశాలలో ఫిజిక్స్‌ ల్యాబ్‌ కూడా లేకపోవడంతో ప్రాక్టికల్స్‌ ఊసే లేదు.
ఇదిగో అధ్యాపకులు వస్తారు, బోధిస్తారు అని చెబుతూ అధికారులు కాలం వెళ్లదీశారంటూ విద్యార్ధినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠాలు వినకుండా తాము పరీక్షలు ఎలా రాస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. పోటీ ప్రపంచంలో ఒక్క మార్కు తక్కువొచ్చినా తాము వెనకపడిపోతామని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఏజెన్సీలో విద్యపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని, డిసెంబర్‌ చివరి వరకు అధ్యాపకులను నియమించకపోవడం బాధ్యతారాహిత్యమని విద్యార్ధినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఎప్పుడు అధ్యాపకులను నియమిస్తారు? ఎప్పుడు పాఠాలు పూర్తి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రభుత్వం స్పందించి తక్షణమే అధ్యాపకుల నియామకం చేపట్టి సిలబస్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.